వారం వారం అన్నమయ్య
నీవు జగన్నాధుడవు నేనొక జీవుడనింతే
నీవలె అనుభవించ నేనెంత వాడను
వైకుంఠ పద మేడ వడి గోర నెంతవాడ
ఈకడ నీదాసుడనౌటది చాలదా
చేకొని నీ సాకార చింతయేడ నేనేడ
పైకొని నీ డాగు మోచి బ్రతికి చాలదా
సొంపుల నీయానంద సుఖమేడ నేనేడ
పంపు శ్రీవైష్ణవ సల్లాపన చాలదా
నింపుల విజ్ఞాన మేడ నేదెలియనెంతవాడ
ఇంపుగా నీకధ వినుటిదియే చాలదా
కైవల్య మందు నీతో కాణాచియాడ నాకు
శ్రీ వేంకటాద్రి మీది సేవ చాలదా
ఈవల శ్రీవేంకటేశ నీవిచ్చిన విజ్ఞ్నానమున
భావించి నిన్ను పొగడే భాగ్యమే చాలదా
‘నీవుజగన్నాథుడవు నేనొక జీవుడనింతే’ అన్నమయ్య కీర్తనకు విశ్లేషణ : సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala
శా॥
గోవిందాయని పాట పాడుటయె వైకుంఠంబుతో తుల్యమౌ!
గోవిందా! యిరు ప్రక్కలన్ వెలయునీ గుర్తులే జ్ఞానమౌ !
గోవిందా యనినిన్నుగొల్చుటగదా కొండంత యైశ్వర్యమౌ!
గోవిందాయని విష్ణుగాథవిన చేకూరున్ చిదానందమే!
(ఉమాదేవి జంధ్యాల)
కీర్తన భావాన్ని పద్యంగా, ప్రార్థనగా మీకందిస్తూ సరళమైన వ్యాఖ్యానం దిగువ వ్రాసాను.
ఓ వేంకటాచలాధీశా! నారాయణా! నీవు ఈ జగత్తుకే ప్రభువువు! నేను జీవుడను. కష్టసుఖాలకు, మంచి చెడ్డలకు, రాగద్వేషాలకూ లోబడి పోయిన వాడిని. నీవు వీటన్నిటికీ చలించని అప్రమేయుడవు. నీవు దేనినైనా చేయగలవనీ, అనుభవింపగలవనీ నీ అవతారాలన్నీ మాకు తెలియజేసాయి. కానీ జీవుడనైన నేను ఏదొచ్చినా తట్టుకోలేను. పొంగిపోవడం, కుంగి పోవడం, ఉద్రేకపడిపోవడం జయించలేని వీడిని. అరిషడ్వార్గలకు లోబడినవాడిని. నీవలే నేను స్థిత ప్రజ్ఞుడను గాను.
నీ వైకుంఠమెక్కడ? అది త్వరగా పొందాలనుకునే అజ్ఞానినైన నేనెక్కడ?
వైకుంఠానికి … అదే స్వామీ నీ పదసన్నిధికి రావాలని కోరిక! ఇన్ని అవకతవకలున్న నేనెలా రాగలను?
అందుకే నీ సేవచేసుకుంటూ, నీ దాసుడిగా ఉంటే చాలనిపిస్తున్నది.
నీ అర్చామూర్తిని చూస్తూనే ఉన్నా. కానీ నాకళ్ళముందు ప్రత్యక్షంగా నిన్ను చూడాలని కోరిక! దానికి నేనర్హుడనా? నీ గుర్తులైన శంఖుచక్రాలను నా బుజాలపై మోస్తూ తిరిగితే చాలు.
అన్నిటికన్నా గొప్పదైన బ్రహ్మానంద సుఖం నీ సన్నిధిలోనే లభ్యమౌతుంది. కానీ నేనది పొందడం సాధ్యమా!వైష్ణవ ప్రవచనం చేస్తే చాలదా!
భగవంతుని గురించిన విజ్ఞానమెక్కడ నేనెక్కడ?
విష్ణు కథలను వింటూ బ్రతికితే చాలు.
కైవల్యానికి కాణాచి అయిన స్థానమెక్కడ …. నేనెక్కడ! అది నీ వేంకటాద్రి మీదనే నే పొందనా!
నీవు నాకిచ్చిన నిన్ను కీర్తింపగల తెలివితో నిన్ను భావించి పొగిడే అదృష్టము చాలదా!
అని అన్నమయ్య ఈ కీర్తనలో సప్తగిరి వాసుని సన్నిధే తనకు వైకుంఠంతో సమానమనీ, శ్రీనివాసుని కీర్తించడమే విజ్ఞానమనీ అదే తనకు బ్రహ్మానందతుల్యమనీ భావించాడు।
స్వస్తి
~~~~~~
డా. ఉమాదేవి జంధ్యాల
(picture digitally colored by me)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి