6, సెప్టెంబర్ 2021, సోమవారం

అంతం కాదిది ఆరంభం! - కధ


నా చిత్రానికి శ్రీమతి శశికళ ఓలేటి గారి అద్భుత రచన.
(facebook group భావుక సౌజన్యంతో)


అంతం కాదిది ఆరంభం!

24 గంటలు మృత్యువుతో పోరాడి, ఎట్టకేలకు కళ్ళు తెరిచింది స్మిత! ఎదురుగా.. ఆందోళనగా చూస్తున్న భర్త సంతోష్, అమ్మ కి ఏమైందో తెలియక బిక్కమొహం వేసి, తన పక్కనే కూర్చున్న కొడుకు సుహాస్ ను చూసి, వెక్కివెక్కి ఏడవడం మొదలు పెట్టింది! స్మిత ను ఆ పరిస్థితిలో చూసి, మరింత తల్లడిల్లిపోయాడు సంతోష్!
" స్మితా! అలా ఏడవకమ్మా! అసలు ఏమైందని అంత కఠిన నిర్ణయం తీసుకున్నావు! నువ్వు లోకాన్ని విడిచి వెళ్లి పోతే ,నేను, సుహాస్ ఎలా బ్రతక గలము అనుకున్నావ్? మా గురించి క్షణమైనా ఆలోచించి ఉంటే... నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసి ఉండే దానివి కాదు! "... అంటూ కోపము, దుఃఖము ,ప్రేమ కలగలిసిన మాటలతో.. భార్యను నిలదీశాడు.. సంతోష్!
" తప్పైపోయింది సంతోష్! ఆడపిల్ల చెడీ పుట్టింటికి ఎప్పటికీ వెళ్ళకూడదు! మన ప్రేమ వివాహం ... మన ఇద్దరినీ మన వారికి దూరం చేసినా.. వారితో సంబంధం లేకుండా బానే బతుకుతున్నాం! లాక్‌డౌన్‌ వలన.. మీ ఫ్యాక్టరీ లే ఆఫ్ చేసి... నీ ఉద్యోగం తీసేసారు! ఇంతలో నేను కోవిడ్ బారినపడటంతో, మన సేవింగ్స్.. నా వైద్యానికి ఆవిరైపోయాయి! భవిష్యత్తు గురించి ఒక్కసారిగా...‌చాలా భయం వేసింది సంతోష్! ఒకసారి మా ప్లీడర్ గారు నాన్న చనిపోతూ... నాకు కొంత ఆస్తి రాసిచ్చారు అన్న విషయం ...చెప్పడం గుర్తొచ్చి... నీకు చెప్పకుండానే మా పుట్టింటికి వెళ్లాను....!"... పాపం అక్కడ ఏ అవమాన పడిందో ఏమో.. అవన్నీ తలుచుకుని, మళ్ళీ భోరున ఏడవడం మొదలు పెట్టింది స్మిత!
అమ్మ ఏడవడం చూసి, సుహాస్ కూడా వెక్కడం మొదలుపెట్టాడు!
" అలాంటి నిర్ణయం తీసుకునే ముందు, నాతో ఒకసారి చర్చించాలి కదా స్మిత! మనం కులాంతరం చేసుకోగానే.. ఇరుపక్షాలూ.. మనతో ..వారికే సంబంధం లేదని తిలోదకాలు ఇచ్చేశారు. మరింక ఏ ఆశతో వెళ్లావు? అయినా నా సమర్ధత మీద నీకు అంత నమ్మకం లేదా స్మిత! నేను ఎప్పటికీ నిరుద్యోగి లాగే ఉండి పోయి ,మిమ్మల్ని ఇబ్బంది పెడతానని ఎందుకు అనుకున్నావు? మనకి మంచి రోజులు వచ్చాయి! నాకు ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరికింది.. కూర్గ్ లో టాటా టీ ఎస్టేట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం ! నీకు ఆ విషయం చెప్పాలని ,ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చేసరికి.. నువ్వు ,ఇలా నిద్రమాత్రలు మింగి నురగలు కక్కుతూ...!".. దుఃఖంతో, అతని గొంతు పూడుకుపోయింది!
భర్త ,పిల్లాడి గురించి ఆలోచించకుండా... ఆవేశంతో ప్రాణాలు తీసుకోబోయిన తన తొందరపాటుతనానికి, పుట్టింట్లో ఆస్తి హక్కు అడిగి, లేదనిపించు కున్నందుకు... స్మిత మనస్సు సిగ్గుతో కుంచించుకు‌ పోతోంది!
" నన్ను క్షమించు సంతోష్! నీ ఆత్మాభిమానం దెబ్బతీసే పని చేశాను! అయితే నిన్ను అవమానించడానికి మాత్రం కాదు! వాళ్లు నా ఆస్తి ఇవ్వనందుకు కాదు.. నాకంత దుఃఖం కలిగింది! కన్నతల్లి.. మా అమ్మ కనీసం .. ఎలా ఉన్నావమ్మా...అని కూడా ,అడగలేదు అంటే.. ఏ ఆడపిల్ల కైనా అంతకన్నా అవమానం మరొకటి ఉండదు కదా! పుట్టింటి గడప ఎక్కిన ఆడపిల్లకు ..కనీసం పసుపు కుంకాలు కూడా ఇవ్వని మా వదినల ప్రవర్తన నన్ను మరింత కృంగదీసింది! ఆవేశంతో ఇంటికి తిరిగొచ్చాక.. నా బుర్రకి ఏమైందో నాకే తెలియదు, ఇలాంటి పాడు పని చేశాను! ఐ యాం వెరీ సారీ సంతోష్!"... అంటూ కొడుకును.. ఆర్తితో గుండెల మీదకు లాక్కుని ,సంతోష్ చెయ్యి పట్టుకుని.. వేడుకోలుగా అడిగింది స్మిత!
" మనలో మనకి క్షమార్పణలు ఎందుకు స్మిత! మనం వీరందరికీ ..చాలా దూరంగా.. ప్రశాంతమైన ప్రదేశం లోకి వెళ్లిపోతున్నాం! సుహాస్ కు మంచి స్కూలు ,నీకు మంచి వైద్యం దొరుకుతుంది అక్కడ! చక్కని పూల తోట మధ్యలో.. చిన్న కుటీరం లాంటి క్వార్టర్స్ కూడా మనకు ఇచ్చారు! ఇంత కన్నా మనకు జీవితంలో కావలసినది ఏంటి! అన్నీ మర్చిపో! మనసు కుదుట పరుచుకో! కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం! సరేనా!"... అంటూ భార్య నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు సంతోష్!
అంతటి ప్రేమైకమూర్తి అయిన భర్త తన పక్కన ఉంటే... తనకేంటి దిగులు.. అనుకుంటూ, తమ బంగారు భవిష్యత్తు లో.. రేపటి వెలుగులకై ఆశావహంగా ఎదురుచూస్తూ... కళ్ళుమూసుకుంది స్మిత!
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ
ఇంత మంచి చిత్రరాజాన్ని మాకిచ్చిన మూర్తి గారికి మనఃపూర్వక నమస్సులతో🙏🙏

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...