4, సెప్టెంబర్ 2021, శనివారం

ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది - అన్నమయ్య కీర్తన


 వారం వారం అన్నమయ్య :

ఈ వారం కీర్తన : ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
చిత్రం : పొన్నాడ మూర్తి, విశ్లేషణ : డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల
పల్లవి:
ఈ పాదమే కదా యిల యెల్లఁ గొలిచినది
యీ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది
చరణములు:
ఈ పాదమే కదా యిందఱును మ్రొక్కెడిది
యీ పాదమే కదా యీ గగనగంగ పుట్టినది
యీ పాదమే కదా యెలమిఁ బెంపొందినది
యీ పాదమే కదా యిన్నిటికి నెక్కుడైనది
ఈ పాదమే కదా యిభరాజు దలఁచినది
యీ పాదమే కదా యింద్రాదు లెల్ల వెదకినది
యీ పాదమే కదా యీ బ్రహ్మ గడిగినది
యీ పాదమే కదా యెగసి బ్రహ్మాండ మంటినది
ఈ పాదమే కదా యిహపరము లొసగెడిది
యీ పాదమే కదా యిల నహల్యకుఁ గోరికైనది
యీ పాదమే కదా యీక్షింప దుర్లభము
యీ పాదమే కదా యీ వేంకటాద్రిపై నిరవైనది
ఓం నమో వేంకటేశాయ !
ప్రార్ధన ( భాగవతం)
మ॥
ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్ నీఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా!
శ్రీమన్నారాయణుని చరణారవిందాల ఘనతను వర్ణించిన ……
‘ఈ పాదమేకదా యిల యెల్లగొలిచినది |ఈ పాదమే కదా యిందిరా హస్తముల కితవైనది ||’ అనే
అన్నమయ్య కీర్తనను గురించి మనం ఈ వారం తెలుసుకుందాం.
దానికన్నాముందు పాదాల ప్రాముఖ్యత
గురించి నాలుగు మాటలు!
పెద్దవాళ్ళ పాదాలకు నమస్కరించడం భారతీయ సంప్రదాయం.
వినయ విధేయతలకు గుర్తు!
పాదాలకు నమస్కరించడం వెనక అంతరార్థం ఏవిటి?
మనలోని అహంకారం తగ్గించుకుంటేనే వంగి మరొకరి కాళ్ళకు నమస్కరించ గలుగుతాం.
కాబట్టి అహంకార రాహిత్యానికి అది నిదర్శనం.
మనపాదాలు ఇతరులకు తగలకుండా చూసుకోవడం మర్యాద!
ఎవరికైనా మనపాదాలు తగిలితే మన్నించమంటాం.
శరీరంలో అవయవాలన్నిటికన్నా అడుగున ఉన్నందుకేమో పాదానికి అడుగు అనే పేరుంది. కానీ ఆ అడుగులు తడబడితే పడతాం.
అవి సరిగా పడితే ముందుకు వెళతాం।
అడుగున ఉన్నా మనశరీరాన్నంతా మోసేవి పాదాలే!
వాటి విలువను మనం గ్రహించక పెద్దగా వాటిని పట్టించుకోం.
కానీ అవిశుభ్రంగా ఉంటే సగం ఆరోగ్యం ఉన్నట్లే. పెద్దల అడుగుజాడలు అంటాం. అంటే వాళ్ళ పద్ధతులు అని అర్థం!
పాదాలకు కూడ సాముద్రికముంది. పాదాల వ్రేళ్ళను బట్టికూడ మనస్తత్వంచెబుతారు.
కావ్యనాయికల వర్ణనలలో పాదాల వర్ణన కనబడుతుంది. వాటిని పద్మాలతో, చివురాకులతో పోల్చడం, మువ్వల పట్టీలున్న, పారాణి పెట్టుకున్న పాదాల అందాలు వర్ణించడం వంటివి ఎన్నో ఉన్నాయి.
ఎవరినైనా పూర్తిగా వర్ణిస్తే
ఆపాద మస్తకం వర్ణించారంటాం. దేవాలయంలో అర్చామూర్తిని దర్శించేటప్పుడు మనచూపులు పాదాలనుంచి క్రమంగా పైకి జరగాలి.
ఇలాంటివి అనేక విశేషాలు చెప్పుకోవచ్చు.
*జగన్నాథుని పాదాలఅందచందాలు
‘శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే’ మకుటం గాగల శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలో
ఏవిధంగా కీర్తించారో మనందరికీ విదితమే. ఒక్క వర్ణనను ఆస్వాదించి
తరవాత అన్నమయ్య కీర్తన చూద్దాం.
తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥
భావం-
ఆ చరణముల అరుణ ద్యుతి పద్మరాగమునే గెలవగలిగినది. ఆ మీగాలి ( పాదంపై భాగం) కాంతి ముందు ఇంద్రనీలమణి ప్రభలు ఎందుకూ కొరగావు. ఇక గోళ్ళు చంద్రకాంతిని తలదన్నగలవి. అటువంటి స్వామి వారి పాదాలను శరణుగోరుతున్నాము .
ఇటువంటి శ్రీపతి పాదాలను
నిరంతరం ధ్యానించే అన్నమయ్య తన కీర్తనలో శ్రీ హరి పాద మహిమను ప్రస్తుతిస్తున్నాడు.
*కీర్తన భావ సౌరభం
~~~~~~~~~~~
ఈ పాదమే కదా వామనావతారంలో భూమండలమంతా కొలిచింది!ఈ పాదం నుండే గంగ పుట్టి విష్ణు పాదోద్భవ అయింది. ఆ గంగను బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడట. వామనావతారంలో శ్రీ హరి తన రెండవ అడుగుగా ఆకాశాన్ని కొలిచినప్పుడు బ్రహ్మ తన దగ్గరున్న గంగతో ఆయన పాదం కడగడం వలన బ్రహ్మకడిగిన పాద మైంది.
ఈ పాదం అనంతమైనది. ఇంద్రాది దేవతల కు ఆ అడుగే ఇడుములు పోగొట్టగలది.
కరిరాజును బ్రోచిన పాదం ,లోకాలకు మేలు చేసే పాదం ఆ హరిపాదమే! భక్తితో మొర పెడితే పరుగున వచ్చిన కథలెన్ని!!
ఈ పాదానికి మించిన అందం ఎక్కడుంది?
ఈ పాదమే కదా రామావతారంలో అహల్యకు శాపవిమోచనం కలిగించింది !
(కృష్ణావతారంలోని ఈ పాదమహిమ మరో కీర్తనలో అన్నమయ్య కీర్తించాడు. అక్కడి విశేషాలలో కాళీయ మర్దనం ముఖ్యమైనది.)
అంతటి మహిమ గలవి, అందమైనవీ, సుకుమారమైనవీ అయిన పాదాలు ఎందరి భక్తుల కోసం పరుగులు తీసి అలిసిపోయాయో అని లక్ష్మీ దేవి ప్రేమతో పాదాలొత్తుతుంది ! భాగ్యదేవతఅయిన లక్ష్మీదేవి అది తన భాగ్యమనుకుంటుంది.
ఈ కీర్తన భావానికి నాహృదయ స్పందన జోడించి సీసపద్యంగా వ్రాసాను . చిత్తగించండి.
సీ॥
ఏచరణకమలమ్మిల గొల్చినట్టిది
యద్దాని దాల్తునా యౌదలందు!
ఏపాద పద్మమ్ము నిభరాజు శరణనె
నద్దాని నెదపైన హత్తుకొందు!
ఏయంఘ్రిఁదామర నిందిర సేవించు
నదినన్ను బ్రోవగ నాశ పడుదు!
ఏపదకంజమ్ము నింద్రుడుమ్రొక్కునో
నయ్యది చూపదే యసలు ద్రోవ!
తే.గీ
ఆయడుగె తీర్చుఁగష్టములమరతటికి !
అదియె మోక్షమార్గమనిరి యఖిల మునులు!
అదియనగనేది మరియేది హరిపదంబు!
అనుచు కీర్తించె నన్నమయ్యార్తితోడ
ఆ హరి చరణాలను సేవించి తరిద్దాం.
నీపాద కమల సేవయు
నీపాదార్చకులతోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును
తాపస మందార నాకు దయసేయ గదే!

Like
Comment
Share
1

కామెంట్‌లు లేవు:

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.   ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన  బాపట్లలో   జన్మించ...