6, సెప్టెంబర్ 2021, సోమవారం

సరళ మనస్సు - కధ, రచన : నీరజ ప్రభల


 
facebook బావుక గ్రూప్ లో నా చిత్రానికి శ్రీమతి నీరజ ప్రభల గారి కధానిక. చదవండి.
 
"శ్రీ పొన్నాడ మూర్తి గారి అద్భుత మైన చిత్రానికి నా చిన్ని ప్రయత్నం ఈ కధ.
 
సరళ మనస్సు.
 
రచన....నీరజ ప్రభల.
 
" మళ్ళీ మొదలెట్టారా అత్తా కోడళ్ళు ? ఇంటికి వచ్చిన మొదలు ప్రతిరోజూ మీ ఇద్దరితో వేగలేక చస్తున్నాను. పెళ్ళిచేసుకోకుండా ఉన్నా బాగుండేది. మనశ్శాంతి లేని బ్రతుకు." ఆఫీసు నుంచి ఇంట్లోకి వస్తూ విసుగ్గా అరుస్తూ తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు రవి.
రవి , సరళ ల పెళ్ళయి 3 సం...దాటింది.. వాళ్ళకు రెండేళ్ళ బాబు కూడా ఉన్నాడు. రవి తల్లి యశోదమ్మకు తన తమ్ముడి కూతురుని కోడలుగా చేసుకోవాలని కోరిక. కానీ రవికి మేనరికం అంటే ఇష్టం లేదు. ఆవిషయమే తల్లి తో చెప్పి ఆమెను బలవంతంగా ఒప్పించి పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఆయన తీసుకువచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకుని సరళను భార్యగా చేసుకున్నాడు రవి.
సరళ చాలా మంచిపిల్ల, చదువుకున్నది కూడా. పెళ్ళైన రెండవ రోజునే తన తల్లి గురించి , తన పెళ్ళి పట్ల ఆవిడ అభిప్రాయాన్ని గురించి సరళకు చెప్పి " అమ్మ ఏమన్నా అంటున్నా బాధపడద్దు. " అని చెప్పాడు రవి.
" ఓస్. ఇంతేనా! అవే సర్దుకుంటాయి. ఆవిడ పెద్దావిడ. మా అమ్మ లాంటిది. నా మంచితనంతో , ప్రేమానురాగాలతో ఆవిడను మారుస్తాను చూడండి " అని నవ్వుతూ అంటున్న భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు రవి. భర్త కౌగిలిలో గువ్వలా ఒదిగి పోయింది సరళ.
సరళ అత్తగారితో ఎంత మంచిగా అనుకూలంగా ఉంటున్నా ఆమె అంటే గిట్టని యశోదమ్మకు ప్రతిరోజూ కావాలని ఏదో ఒక నెపంతో కయ్యానికి కాలుదువ్వటం అలవాటు గా పెట్టుకుంది. దానికి కారణం రవి ముందే చెప్పాడు కనుక ఆవిడ ధోరణి అంతే అనుకుని సర్దకుపోతోంది సరళ . భర్త ఆఫీసు పనులతో సతమవుతాడని ఏనాడూ అతనితో తన బాధను చెప్పలేదు సరికదా అతని ముందు గొడవ జరగకుండా చూడటానికి ప్రయత్నం చేసేది. ఇది అలుసుగా తీసుకుని కావాలని కొడుకు ముందే కోడలితో గొడవకు దిగేది యశోదమ్మ.
రవి చాలాసార్లు తల్లికి అనునయంగా నచ్చచెప్ప చూశాడు. కానీ ఆమె వినిపించుకోకుండా " అంతేలేరా! అడ్డాలనాడు బిడ్డలు గానీ - గడ్డాలనాడు కాదు. పెళ్ళైనాక ' పెళ్ళాం బెల్లం - తల్లి అల్లం' అని ఊరికే అన్నారా ! అయినా ఈ ముసలిదాన్ని వదిలి ఆయన ఏలోకానికి పోయాడో " అని సణుగుతూ అన్నానికి రాక భీష్మించుకుంటుంది. తల్లంటే ప్రేమతో మళ్ళీ రవే వెళ్ళి ఆవిడను బ్రతిమాలి తీసుకురావడం పరిపాటిగా మారింది. రవి పెళ్ళయి 3 సం... దాటి , ముద్దుల మనవడున్నా ఆవిడ ధోరణి మారలేదు.
ఇలా ప్రతిరోజూ అత్తా కోడళ్ల మధ్య జరిగే వివాదమే అయినా ఎందుకో ఈరోజు భర్త విసుగ్గా అన్న ఆమాటలు సరళ మనసుకి ఎక్కడో బలంగా తగిలి మనసు క్షోభించింది. తను ఎంత సర్దుకుని పోతున్నా భర్త తనను అర్థం చేసుకోకుండా అలా అనేటప్పటికి మనసులో బాధ ఎక్కువయింది. అతనికి తన బాధ తెలియ చెపుదామన్నా తల్లి అంటే అతనికి పిచ్చి ప్రేమ. ఇంక అతనికి చెప్పినా ప్రయోజనం లేదు అనుకుని ఊరుకుంది.
మామూలుగా ఆరాత్రి వాళ్ళకు భోజనాది కార్యక్రమాలను పూర్తిచేసింది. తనకు తినాలనిపించలేదు. కొడుకుని నిద్ర పుచ్చి , భర్త పడుకున్నాక తనూ పడుకుందన్న మాటే గానీ ప్రతిరోజూ అత్తగారితో గొడవలు, ఈరోజు భర్త మాటలు అన్నీ గుర్తొచ్చి మనసు కలత చెంది ఈలోకానికి నిష్క్రమణ చెపుదామని నిద్రమాత్రలను మింగింది సరళ. ఆసమయంలో ఆమెకు తన భర్త గానీ, ముద్దులొలికే తన బాబు గానీ గుర్తుకురాలేదు.
కాసేపటికి బాబుకు ఆకలయ్యి పాల కోసం అమ్మ ను " అమ్మా! అమ్మా" అని తన చిట్టి చేతులతో తల్లిని తట్టి లేపి పెద్దగా ఏడుస్తున్నాడు. రవికి మెలకువ వచ్చి బాబుని ఎత్తుకుని భార్య వంక చూసి తనను ఎంతగా తట్టి లేపుతున్నా ఆమెలో చలనం లేకపోయింది. వెంటనే సరళను హాస్పిటల్ లో చేర్చాడు. డాక్టర్లు అతికష్టం మీద ఆమెని బ్రతికించారు.
కాసేపటికి కళ్ళు తెరిచిన సరళకు ఎదురుగా తన వంకే ప్రేమగా చూస్తూ తన చేతిని పట్టుకున్న భర్త, ముద్దులొలికే బాబు కనబడేటప్పటికి మనసు తరుక్కుపోయింది.
" నీవు నాకు దక్కవని ఎంత భయపడ్డానో తెలుసా! నన్ను, బాబుని వదిలి ఎలా వెళ్ళాలనుకున్నావు ? మేమేం కాను ? నిన్నొదిలి నేను బ్రతకలేను సరూ! " అంటున్న భర్త చేతిని తన చేతిలోకి తీసుకొని చెమర్చిన కళ్ళతో బాబుని గుండెలకదుముకుంది సరళ.
కాసేపటికి యశోదమ్మ లోపలికి వచ్చి సరళ చేతిని పట్టుకుని "పెద్దదాన్ని , ఏదో అన్నానే అనుకో అమ్మాయి. ఇంత అఘాయిత్యానికి ఒడిగడతావనుకోలేదు . ఇంకనుంచీ నేను నీతల్లిననుకో " అంటున్న అత్తగారి చేతిని ఆప్యాయంగా అందుకుంది సరళ.
......నీరజ ప్రభల."

 

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...