23, అక్టోబర్ 2024, బుధవారం

ముందు చూపు కలిగి - ఆటవెలది


ఎంత చక్కటి చిత్రమో 😍

ఆటవెలది //

ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు 

కన్ను మూసి మంచి కలలు గనుచు 

హాయిననుభవించు రేయి పగలు 

యంత దూర దృష్టి వింత గొలిపె!


( నా చిత్రకళను ప్రశంసిస్తూ ఈ చిత్రానికి పద్యం రచించిన శ్రీమతి జానకి గంటి గారికి ధన్యవాదాలు )

11, అక్టోబర్ 2024, శుక్రవారం

సాలూరు రాజేశ్వరరావు - చలనచిత్ర సంగీత దిగ్గజం


నా పెన్సిల్ చిత్రం - రాజేశ్వరరావు గారి గురించి చాలా విషయాలు తెలియపరిచిన శ్రీ షణ్ముఖాచారి గారికి ధన్యవాదాలు .


 _*ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సమర్పిస్తున్న ఈ నా వ్యాసం వారి రాగాలాపనలాగే కాస్త సుదీర్ఘంగా ఉంటుంది. ఓపికతో చదవాలి.*_


*(ర)సాలూరు సంగీత సారస్వతం... రాజే(శ్వ)స్వరరావు*


*...ఆచారం షణ్ముఖాచారి*


_తెలుగు చలనచిత్ర స్వర మాంత్రికుడు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అందిస్తున్న వ్యాసమిది. అందరి సంగీత దర్శకుల వ్యవహార శైలి ఒకటిగా వుంటే రాజేశ్వరరావు శైలి తద్భిన్నంగా, వినూత్నంగా వుండి, అందరి దృష్టిని ఆకర్షించేది. ఆత్మాభిమానానికి రాజేశ్వరరావు ఇచ్చిన విలువ ధనార్జనకు ఇవ్వలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడూ సడలించని మనస్తత్వం రాజేశ్వరరావుకు సొంతం. పాటనుబట్టి వాయిద్యాలనిర్ణయం జరగాలే తప్ప వున్నాయికదా వాయిద్యాలు వాడుకుందాం అనే భావనను ఎప్పుడూ ఆయన దరిచేరనీయ లేదు. జానపద, సాంఘిక చిత్రాల పాటలకు ఎన్ని వాద్యపరికరాలు వుండాలి, పాశ్చాత్య ధోరణి పాటకైతే ఎన్ని వాయిద్యాలును వాడాలి అనే ఖచ్చితమైన లెఖ్ఖలు రాజేశ్వరరావు దగ్గర వుండేవి. జానపద పాటలకు ఫ్లూటు, డప్పులు, జముకు, డోలక్, క్లారినెట్, పంజా, షెహనాయి వంటి వాద్యపరికరాలను రాజేశ్వరరావు ఎక్కువగా వాడేవారు. వెస్ట్రన్ ట్యూన్ ఆధారిత పాటలకు యాభైకి పైగా వయొలిన్లు వాడిన సందర్భాలు రాజేశ్వరరావు కు కోకొల్లలు. చంద్రలేఖ సినిమాలో సెల్లోలు, హేమాండ్ ఆర్గాన్, ఎలెక్ట్రిక్ గిటార్, ట్రంపెట్లు, త్రోంబోన్, సింథసైజర్, జిప్సీలు వాడే వాద్య పరికరాలు వుపయోగించి ఒక నూతన ఒరవడి సృష్టించిన ఆ మహనీయుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం._

  

*బాల రసాల సాలూరు...*


సాలూరు రాజేశ్వరరావు అక్టోబరు 11, 1921 న విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో వుండే శివరామపురం లో జన్మించారు. మంగమ్మ, సన్యాసిరాజు ఆయన తల్లిదండ్రులు. తండ్రి మంచి కవి, మృదంగ విద్వాంసుడు. విజయనగరం రాజాస్థానంలో ఆయన పనిచేసేవారు. సన్యాసిరాజు వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలకు మృదంగం వాయించేవారు. రాజేశ్వరరావు కు చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి వుండేది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కార్యక్రమాలకు రాజేశ్వరరావు క్రమం తప్పకుండా వెళ్ళేవారు. ఆయనవద్ద హరికథలు చెప్పడంలో శిక్షణ తీసుకొని అప్పుడప్పుడు పెళ్లి పందిళ్ళలో సరదాగా హరికథలు చెప్పేవారు. ద్వారం వారి శిష్యరికంలో త్యాగరాయ కృతులు, వర్ణాలు నేర్చుకున్నారు. దసరా ఉత్సవాలకు ఈ బాలరాజేశ్వరరావు పల్లెటూర్లలో హరికథా కాలక్షేపం చేసేవారు. విశాఖపట్నంలో రాజేశ్వరరావు తన సోదరుడు హనుమంతరావుతో కలిసి కచేరి చేసినప్పుడు వైణిక విద్వాంసులు సంగమేశ్వర శాస్త్రి వీరికి బంగారు పతకం బహూకరించారు. అప్పుడే హచ్చిన్స్ రికార్డింగ్ కంపెనీ వారు కొత్త గాయకుల అన్వేషణలో విజయనగరానికి వచ్చి, రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి, బెంగుళూరు తీసుకెళ్ళి భగవద్గీత తోబాటు కొన్ని పాటలు పాడించి రికార్డులు విడుదల చేశారు. వేల్ పిక్చర్స్ వారు 1934 లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా తీసేందుకు ప్రయత్నాలు జరుపుతున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం, పి.వి. దాసు బెంగుళూరులో రాజేశ్వరరావు పాడిన రికార్డులు విని అతనికి శ్రీకృష్ణుడు వేషాన్ని కరారు చేశారు. అలా పన్నెండేళ్ళ వయసులో బెరుకు లేకుండా రాజేశ్వరరావు ఆ చిత్రంలో నటించారు. ఆ సినిమా 1935 నవంబరు 23న విడుదలై విజయదుందుభి మ్రోగించింది. ఆరోజుల్లో ‘శ్రీకృష్ణలీలలు’ సినిమా ప్రచారంలో భాగంగా కరపత్రాలు విసరడానికి హెలికాప్టర్ సేవలను వినియోగించడం గొప్పగా చెప్పుకున్నారు. తరవాతి సంవత్సరం వేల్ పిక్చర్స్ వారు ‘మాయాబజార్’ చిత్రాన్ని నిర్మించారు. అందులో రాజేశ్వరరావు అభిమన్యుడి వేషం వేశారు. ఆ తరవాత న్యూ థియేటర్స్ వారు ‘కీచక వధ’ సినిమా నిర్మిస్తూ అందులో ఉత్తరుడుగా నటించేందుకు రాజేశ్వరరావును ఎంపికచేసి కలకత్తా తీసుకెళ్ళారు. అక్కడ రాజేశ్వరరావుకు కె.ఎల్. సైగల్, పంకజ్ మల్లిక్ వంటి సంగీత నిష్ణాతులతో పరిచయం యేర్పడింది. వారి సహవాస ఫలితంగా రాజేశ్వరరావుకు హిందుస్తానీ సంగీతం మీద ఆసక్తి పెరిగి ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ వద్ద ఆ సంగీతపు మెలకువలు ఆపోశన పట్టారు. మరోవైపు హార్మోనియం, సుర్ బహార్, సితార్ వంటి సంగీత పరికరాలను ఉపయోగించడం నేర్చుకున్నారు. న్యూ థియేటర్స్ కు చెందిన ఆర్.సి. బోరల్, పంకజ్ మల్లిక్ లవద్ద ఆర్కెస్ట్రా ఎలా కండక్ట్ చేయాలో తర్ఫీదుపొందారు. వాద్యపరికరాలను కలిపి రాగాలను సృష్టించడం వంటి మెలకువలన్నీ రాజేశ్వరరావు వారి దగ్గరే నేర్చుకున్నారు. ఆ మెలకువలు అవగతమయ్యాక సంగీత దర్శకత్వం నెరపాలనే కోరిక పెంచుకున్నారు. మద్రాసు తిరిగి వచ్చాక సంగీత దర్శకుడు జయరామయ్యర్ వద్ద సహాయకుడిగా చేరి ‘విష్ణులీల’ అనే తమిళ సినిమాకు పనిచేశారు. కన్నడంలో నిర్మించిన ‘వసంతసేన’ సినిమాకు ఆర్. సుదర్శనం వద్ద సహాయకునిగా పనిచేశారు. 


*పద్దెనిమిదేళ్ళకే సంగీత దర్శకునిగా...*


రాజేశ్వరరావు ప్రతిభ గుర్తించిన శ్రీ శారదా రాయలసీమ ఫిలిమ్స్ వారు 1939లో ‘జయప్రద’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావును సంగీత దర్శకునిగా నియమించారు. రాజేశ్వరరావు బొంబాయి నుంచి రికార్డింగ్ పరికరాలను తెప్పించి పాటలు రికార్డు చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడక పోవడంతో సంగీత దర్శకునిగా రాజేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదు. 1940 లో గూడవల్లి రామబ్రహ్మం ఇందిరా దేవి ఫిలిమ్స్ పతాకం మీద ‘ఇల్లాలు’ సినిమా నిర్మిస్తూ రాజేశ్వరరావుకు ఒక వేషమిచ్చారు. గూడవల్లి నిర్మించే సినిమాలకు భీమవరపు నరసింహరావు ఆస్థాన సంగీత దర్శకుడు. అయితే రాజేశ్వరరావు తండ్రి సన్యాసిరాజు అభ్యర్ధన మేరకు రాజేశ్వరరావుకు సంగీత దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఈ సినిమాలో రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి జంటగా నటించారు. అందులో వీరి జంట ఆలపించిన “కావ్యగానము చేసి కైపెక్కినానే, దివ్యలోకాలన్నీ తిరిగొచ్చినానే” అనే పాట బాగా పాపులరైంది. రాజేశ్వరరావు ‘ఇల్లాలు’ సినిమాలో ప్లేబ్యాక్ పధ్ధతి ప్రవేశపెట్టి సఫలీకృతులయ్యారు. రికార్డింగ్ మొత్తం జెమినీ స్టూడియోలో జరిగినప్పుడు రాజేశ్వరరావు చొరవను ఎస్.ఎస్. వాసన్ గమనించారు. తన స్టూడియోలో సంగీత విభాగంలో రాజేశ్వరరావు కు చోటు కలిపించారు. జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మించిన జీవన్ముక్తి (1942), బాలనాగమ్మ (1942) సినిమాలకు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. జీవన్ముక్తి లో “జయజయ పరమాత్మా సకల భువన కారణా”, “దాశరథే దయాశరదే”, “మేలుకో జీవా తూర్పు తెలవారే” పాటలు; బాలనాగమ్మ సినిమాలో “నా సొగసే కని మరుడే దాసుడు కాడా”, “శ్రీ జయజయ గౌరీ రమణా” వంటి పాటలు బాగా పాపులరయ్యాయి. బాలనాగమ్మ సినిమాకు రాజేశ్వరరావు చేసిన రీ-రికార్డింగు అద్భుతమని, ముఖ్యంగా మాయల ఫకీరు ప్రవేశంలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ కి పెద్దవాళ్ళు కూడా జడుసుకునేవారని చెప్పుకునేవారు. జెమినీ వారు నిర్మించిన ‘చంద్రలేఖ’ (1946) తమిళ/హిందీ  సినిమాకు రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం ఆయన కీర్తిని ఇనుమడింపజేసింది. ముఖ్యంగా డ్రమ్ డ్యాన్సు సంగీతానికి రాజేశ్వరరావు అహర్నిశలు శ్రమించారు. రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ డ్రమ్ డ్యాన్స్ పాటకోసం మద్రాసులో వున్న వాద్యకారులందరి సేవలు వినియోగించుకున్నారు. వారు సరిపోక పోలీసు బ్యాండ్ దళాన్ని, నేవీ బ్యాండ్ దళాన్ని కూడా వుపయోగించుకున్నారు. ఈజిప్టు, ఆఫ్రికా దేశాలనుంచి జిప్సీలు వాడే వాద్యపరికరాలను దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించేందుకు వదలకొద్దీ రిహార్సల్స్ చేయించారు. ఈ సినిమా సంగీతాన్ని పూర్తిచేసేందుకు సుమారు ఏడాది సమయం పట్టిందంటే ఆలోచించండి రాజేశ్వరరావు ఎంతగా శ్రమించి ఉంటారో! తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమా విడుదలైనప్పుడు హిందీ చలనచిత్రసీమకు చెందిన సంగీత పండితులు, సాంకేతిక కళాకారులు, ఆ సినిమా సంగీతాన్ని, చిత్రీకరణను తిలకించి పులకించిపోయారు. పాతికేళ్ళు కూడా నిండని ఓ కుర్రాడు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడంటే నమ్మలేకపోయారు. తరవాత జెమినీ వారు నిర్మించిన ‘అపూర్వ సహోదరులు’, ఆ చిత్ర హిందీ వర్షన్ ‘నిషాన్’ (1950) లకు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అదే సమయంలో బి.ఎన్. రెడ్డి ‘మల్లీశ్వరి’ (1951) సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజేశ్వరరావుకు పిలుపొచ్చింది. ఈ సినిమా పాటలు స్వరపరచి రికార్డింగ్ చెయ్యడానికి ఆరునెలల సమయం పట్టింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి పాటలు రాసిన తరవాతే రాజేశ్వరరావు వాటికి స్వరాలు సమకూర్చారు. ఆర్కెస్ట్రా సహకారాన్ని ఆద్దేపల్లి రామారావు అందించారు. అందులో “ఎందుకే నీకింత తొందరా”, “ఎవరు ఏమని విందురు”, కోతిబావకు పెళ్ళంట”, “పరుగులు తీయాలి”, “మనసున మల్లెల మాలలూగెనే” పాటలు నేటికీ అజరామరాలే. ఆ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. 1954 లో భానుమతి నిర్మించిన ‘విప్రనారాయణ’ సినిమాకు శాస్త్రీయ సంగీత బాణీలతో అద్భుత సంగీతాన్ని అందించారు రాజేశ్వరరావు. “ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతన”, “చూడుమదే చెలియా కనులా”, “పాలించర రంగా”, “మధుర మధురమీ చల్లని రేయి”, ”మేలుకో శ్రీరంగ మేలుకోవయ్యా” మొదలైన పాటలు ఘంటసాలతో కాకుండా ఎ.ఎం.రాజా, భానుమతి కాంబినేషన్లో పాడించి హిట్ చేయడం రాజేశ్వరరావు ప్రతిభే. “ఎందుకోయీ తోటమాలి” పాట బాణీ రాజేశ్వరరావుకు సిటీ బస్సులో ప్రయాణం చేస్తుండగా స్పురించింది. బస్సు దిగిన వెంటనే భరణీ స్టూడియోకి వెళ్లి వెనువెంటనే ఆ పాటకు పూర్తి స్థాయి బాణీని స్వరపరచడం జరిగింది. ముందుగా అల్లిన స్వరానికి సముద్రాల రాసిన పాట అది. విజయా వారి మిస్సమ్మ చిత్రంలో కూడా రామారావుకి రాజా చేత పాటలు పాడించి ప్రయోగం చేశారు రాజేశ్వరరావు. “ఔనంటే కాదనిలే, కాదంటే ఔననిలే”, “తెలుసుకొనవె యువతి”, “బృందావనమది అందరిదే”, “రావోయి చందమామా” పాటలు ఇందుకు ఉదాహరణలు. అదే సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన “కరుణించు మేరిమాతా” పాట క్రైస్తవుల మందిరాలలో నేటికీ తరచూ వినిపిస్తూనే వుంటుంది. ఈ సినిమాని ఎ.వి.ఎం వారు హిందీలో ‘మిస్ మేరి’ గా పునర్నిర్మించినప్పుడు సంగీత దర్శకుడు హేమంత్ కుమార్ “బృందావనమది అందరిది” పాట బాణీని యధాతధంగా వాడుకోవడం జరిగింది. ఇందుకోసం హేమంత్ కుమార్ రాజేశ్వరరావు దగ్గర సమ్మతి తీసుకోవడం కూడా సత్సంప్రదాయం గా అమరింది. తరవాత ఎ.వి. ఎం వారి భక్త ప్రహ్లాద, బి.ఎ. సుబ్బారావు గారి ‘చెంచులక్ష్మి’, వాహినీ వారి ‘రంగులరాట్నం’, ‘బంగారు పంజరం’, బి. ఎస్. రంగా గారి ‘అమరశిల్పి జక్కన్న’, అన్నపూర్ణా వారి ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మగౌరవం’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘ఆత్మీయులు’, పి.ఎ.పి. వారి ‘భార్యాభర్తలు’, జగపతి వారి ‘ఆరాధన’ వంటి సినిమాలకు రాజేశ్వరరావు వైవిధ్యమైన సంగీతం సమకూర్చారు. తెలుగులో వచ్చిన తొలి డబ్బింగ్ చిత్రం ‘ఆహుతి’ (1950-హిందీలో నీరా అవుర్ నందా) సినిమాకు శ్రీశ్రీ స్వేచ్చనువాదంతో పాటలు రాస్తే రాజేశ్వరరావు వాటిని హిట్ చేసి చూపారు. “ప్రేమయే జనన మరణ లీల”, “ఊగిసలాడేనయ్యా పడవ” పాటలు అలాంటివే. ‘అమరశిల్పి జక్కన్న’ (1964) సినిమాలో రాజేశ్వరరావు స్వరపరచిన “ఈ నల్లని రాలలో యే కన్నులు దాగెనో”, ”నిలువుమా నిలువుమా నీలవేణి”, “అందాల బొమ్మతో ఆటాడవా” (జావళి), “నగుమోము చూపించవా గోపాలా” (జావళి), “ఎదో గిలిగింత ఏమిటీ వింత” పాటలు నేటికీ నిత్యనూతనంగా భాసిల్లుతున్నాయి. ముఖ్యంగా రాజేశ్వరరావు ఇందులో  వాద్యాలను ఉపయోగించిన తీరు పరమాద్భుతం. 


*అద్భుతాల స్వరమాంత్రికుడు ...*


పాటలే కాదు, పౌరాణిక సినిమాలలో వుండే పద్యాలకు అద్భుతమైన బాణీలు కట్టి, తక్కువ ఆలాపనతో వాటిని హిట్ చేసిన ప్రతిభాశాలి రాజేశ్వరరావు. పద్యాలను ఘంటసాల, మాధవపెద్ది, పి.బి. శ్రీనివాస్ ల చేత ఆలపింపజేసిన తీరుగొప్పగా వుంటుంది. మద్రాసులో వాహినీ స్టూడియో కార్మికులు సమ్మె చేసిన సందర్భంలో అన్నపూర్ణా వారి ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమా షూటింగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్పట్లో పాటల రీ-రికార్డింగ్ పనులు మద్రాసులో జరుగుతుండేవి. ఆ సదుపాయాలు హైదరాబాదు సారథి స్టూడియోలో లేవు. అందుకు నాందీ ప్రస్తావన చేసిన మహనీయుడు రాజేశ్వరరావే. సమ్మె సమయంలో కొంతమంది ముఖ్య వాద్యకారుల్ని హైదరాబాదు రప్పించి, స్థానిక కళాకారుల సహకారంతో పాటల రికార్డింగు, రీ-రికార్డింగ్ పనులు సజావుగా పూర్తిచేయించిన ఘనత రాజేశ్వరరావుకే దక్కుతుంది. రాజేశ్వరరావు మ్యూజిక్ సిట్టింగులకు ఆలస్యంగా వెళ్ళేవారు. అందుకు ఒక కారణముంది. అర్ధరాత్రి రేడియోలో బి.బి.సి, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి విదేశీ ఛానళ్ళలో వచ్చే సంగీతాన్ని వింటూ, మంచి ట్యూనులు స్పురిస్తే వాటి నోటేషన్లను రాసుకుంటూ, ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్రపోయేవారు. ఆలస్యంగా నిద్ర లేచేవాళ్ళు. అందుకే మ్యూజిక్ సిట్టింగులకు, రికార్డింగులకు రావడం ఆలస్యమయ్యేది. వీణా వాద్యమన్నా, సితార వాద్యమన్నా రాజేశ్వరరావుకు యెంతో ఇష్టం. వీణ నేపథ్యంలో రాజేశ్వరరావు ఎన్నో గొప్పపాటలు సృష్టించారు. విదేశీ వాద్యాలతో రాజేశ్వరరావు ఎన్నో ప్రయోగాలు చేసేవారు. బెంగాలి సంగీతాన్ని, ఆఫ్రికన్ జిప్సీ సంగీతాన్ని శ్రద్ధగా విని, మంచి బిట్లు వుంటే అనుకరించేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావుకు సైగల్, నౌషాద్, సచిన్ దేవ్ బర్మన్, హేమంత్ కుమార్ సంగీతమంటే చాలా ఇష్టం. విదేశీ సింఫనీలనుండి ప్రేరణ పొందేవారు. పాటకు మాతృక ఫలానా అని చెప్పేందుకు వెనుకాడేవారు కాదు. రాజేశ్వరరావు తనయులు అందరూ సంగీత విద్వాంసులే. పెద్దబ్బాయి రామలింగేశ్వరరావు మంచి పియానో ప్లేయర్ కాగా, పూర్ణచంద్రరావు, వాసూరావు మంచి సంగీత దర్శకులు. కోటి విషయానికొస్తే ఆయన ఎన్నో చిత్రాలకు అద్భుత సంగీతం అందించారు. సింధుభైరవి, కల్యాణి, మాలకోస్, భీమ్ పలాస్, మోహన రాగాలంటే రాజేశ్వరరావుకు చాలా ఇష్టం. రాజేశ్వరరావు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. తెల్లటి పంచె, లాల్చీ వస్త్రధారణతో బెంగాలి బాబులను మరపించే రాజేశ్వరరావు సంగీతం అజరామరం... అమరం!!


*మరిన్ని విశేషాలు ...*


చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయిన ‘మల్లీశ్వరి’ చిత్రంలో “మనసున మల్లెల మాలలూగెనే” పాట రికార్డింగుకు ముందు రిహార్సల్స్ జరుగుతున్నాయి. భానుమతి ఆ పాటను ప్రాక్టీస్ చేస్తూ రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలో కాకుండా తనదైన శైలిలో పాడుతోంది. రాజేశ్వరరావుకు ఆమె పధ్ధతి నచ్చలేదు. “అలలు కొలనులో గలగలమనినా” చరణాన్ని ‘’ఇలా పాడాలి’’ అని రాజేశ్వరరావు మరోసారి బాణీని పాడి వినిపించారు. భానుమతికి ఉక్రోషం వచ్చింది. “నేనూ సంగీతంలో మాస్టర్నే” అని పెడసరంగా బదులిచ్చింది. రాజేశ్వరరావు యేమీ మాట్లాడలేదు. బాత్ రూముకు వెళ్ళినట్లే వెళ్లి ఇంటికి వెళ్ళిపోయారు. ఇది జరినప్పుడు దర్శకుడు బి.ఎన్. రెడ్డి అక్కడ లేరు. గంటన్నర తరవాత వచ్చి చూస్తే ఆర్కెస్ట్రా వాళ్ళు మాత్రమే వున్నారు. రాజేశ్వరరావు కనపడలేదు. తబలా వాద్యకారుడు లక్ష్మణరావు జరిగిన విషయాన్ని బి.ఎన్. కు వివరించి చెప్పాడు. బి.ఎన్. హుటాహుటిన రాజేశ్వరరావు ఇంటికి వెళ్ళారు. “ఈ సినిమా చేయడానికి నాకు ఏమీ అభ్యతరం లేదు. భానుమతికి ఉందేమో కనుక్కోండి” అంటూ రాజేశ్వరరావు తనదైన శైలిలో చెప్పారు. బి.ఎన్. భానుమతికి కబురంపి కాస్త గట్టిగానే మందలించారు. భానుమతి రికార్డింగుకు వచ్చి రాజేశ్వరరావు చెప్పిన పద్ధతిలోనే పాడింది. పాట రికార్డు చేశారు. రికార్డింగ్ అయ్యాక అందరూ ఆ పాట ఎలా వచ్చిందోనని వింటున్నారు. “అలను కొలనులో” చరణం వచ్చింది. భానుమతి లేచివచ్చి రాజేశ్వరరావుకు ప్రణమిల్లింది. “మాస్టారూ, హాట్స్ ఆఫ్. ఇప్పుడు వింటుంటే నాకు తెలుస్తోంది మీరు నన్ను యెందుకు హెచ్చరించారోనని. నేనే కాదు మున్ముందు మీరు చెప్పినదానికి యెవరు అడ్డు చెప్పినా వారికి పాడే అర్హత వుండదు” అంటూ నమస్కారం మీద నమస్కారం చేస్తూ చెప్పింది. 


విజయా వారి ప్రతిష్టాత్మక చిత్రం ‘మాయాబజార్’ (1957) సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా నియమించింది రాజేశ్వరరావునే. అందులో “చూపులు కలసిన శుభవేళా”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నీవేనా నను తలచినది”, “నీకోసమే నే జీవించునదీ” పాటలకు స్వరాలల్లి, మ్యూజిక్ బిట్లు కూడా సమకూర్చినది రాజేశ్వరరావే. ఐదవ పాటగా ‘కుశలమా కుశలమా నవ వసంత మాధురిమా’ అంటూ సాగే పల్లవిని బీంపలాస్ రాగంలో రాజేశ్వరరావు స్వరపరచారు. ఈ సమయంలో దర్శకుడు కె.వి. రెడ్డితో రాజేశ్వరరావుకి పొసగలేదు. కె.వి. రెడ్డి పద్ధతులు భిన్నంగా వుండేవి. పాటను కంపోజ్ చేసేటప్పుడు నిర్మాత, గేయ రచయిత, నృత్య దర్శకుడు, కళాదర్శకుడు కూడా ఉండాలనేది కె.వి. రెడ్డి నియమం. పాటకు ట్యూను కట్టేటప్పుడు సాహిత్య శైలి ఎలావుండాలి, ప్రతి సంగీత బిట్టుకి డ్యాన్స్ ఎలా అమరుతుంది, నటీనటుల భంగిమలు ఎలావుంటాయి వంటి అంశాలపై వీరు సూచనలు ఇచ్చేవారు. ఒక సందర్భంలో వీరంతా కూర్చొని వున్నప్పుడు కె.వి. రెడ్డి పాటను కంపోజ్ చేయమని రాజేశ్వరరావుకు చెప్పారు. సాలూరు వారికి ఆ పద్ధతి రుచించలేదు. పైగా మ్యూజిక్ సిట్టింగులలో చక్రపాణి జోక్యాన్ని రాజేశ్వరరావు జీర్ణించుకోలేక పోయారు. కోపం వచ్చింది. ‘’ఇది మ్యూజిక్ రూమ్ లా లేదు. కోర్టు హాలులా వుంది’’ అంటూ చిరాకుపడి లేచి వెళ్ళిపోయారు. దాంతో కె.వి. రెడ్డికి రాజేశ్వరరావుకి అభిప్రాయ భేదాలతోబాటు బహిరంగ పరచలేని మరికొన్ని కారణాలు తోడవడంతో రాజేశ్వరరావు తప్పుకున్నారు. ఆ స్థానంలో ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించారు. “బాణీలు కట్టేటప్పుడు సంగీత దర్శకునికి స్వేచ్చ వుండాలి. సంగీతజ్ఞానం లేనివాళ్ళు, ఎంతపెద్ద నిర్మాతలైనా జోక్యం చేసుకుంటే మంచి సంగీత సృష్టి జరగదు” అని గట్టిగా నమ్మిన వ్యక్తి రాజేశ్వరరావు. అంతేకాదు ఆయన ఆత్మాభిమానానికి అత్యంత విలువనిచ్చే సంగీత స్రష్ట కూడా!


అన్నపూర్ణా సంస్థ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు సాలూరు రాజేశ్వరరావు అన్నా, అతని సంగీతమన్నా  విపరీతమైన అభిమానం. అన్నపూర్ణా పిక్చర్స్ సినిమాలకు సంగీత సారథి రాజేశ్వరరావే. వారు తొలి సినిమా ‘దొంగరాముడు’ నిర్మించదలచినప్పుడు రాజేశ్వరరావునే సంగీత దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. అయితే రాజేశ్వరరావును భరించడం కష్టమని కొందరు సలహా ఇవ్వడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అప్పుడు పెండ్యాల సారధ్యం వహించారు. తరవాత ‘వెలుగు నీడలు’ సినిమాకు రాజేశ్వరరావును సంగీత దర్శకుడిగా అనుకున్నా, కబురంపితే రాజేశ్వరరావు రాలేదు. ఆ అవకాశాలు కూడా పెండ్యాలకు దక్కాయి. తరవాత ఒకానొకసందర్భంలో ఇద్దరూ కలవడం జరిగింది. ‘’అన్నపూర్ణా సంస్థ నిర్మించే చిత్రాలకు మీరు పనిచెయ్యరా’’ అని దుక్కిపాటి అడిగిన ప్రశ్నకు రాజేశ్వరరావు తనదైన శైలిలో బదులిచ్చారు. “మీరు చాలా నిబద్ధతతో ఉంటారని. సమయానికి రాకపోతే కోప్పడతారని మా ఆర్కెస్ట్రా వాళ్ళు చెప్పారు. అందుకే రాలేదు” అనేది ఆ జవాబు. తర్వాత రాజేశ్వరరావు ’ఇద్దరు మిత్రులు’ చిత్రంతో అన్నపూర్ణలో అడుగుపెట్టి అజరామరమైన సంగీతాన్ని అందించారు. దుక్కిపాటి రాజేశ్వరరావుగారి ఇంటికి కారు పంపేవారు. “రాజేశ్వరరావు ఎప్పుడు వచ్చి కారేక్కితే అప్పుడే తీసుకురా. అంతేగాని, కారొచ్చింది ఎక్కండి అని మాత్రం అనవద్దు” అని డ్రైవర్ ను హెచ్చరించి మరీ కారు పంపేవారు. రాజేశ్వరరావు మనసెరిగి, ఆయన వీలున్నప్పుడు వచ్చి పాటలకు బాణీలు కట్టే విధంగా వాతావరణాన్ని సృష్టించడం చేతనే అన్నపూర్ణ వారి సినిమాలకు అత్యద్భుతమైన పాటలు పురుడుపోసుకొని నేటికీ శ్రోతలకు వీనుల విందు చేస్తున్నాయి. 


వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న రాజేశ్వరరావు డబ్బుకోసం ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేదు సరికదా సంగీత సరస్వతికి అపచారం జరిగితే సహించలేదు కూడా. నిర్మాతల సరళి నచ్చక ‘కృష్ణవేణి’ సినిమా ను వదలుకున్నారు. ఎన్.టి. రామారావు సినిమాలు కూడా వదలుకున్న సందర్భాలు లేకపోలేదు. రామారావు సంస్థలో ఒక చిత్రానికి సంబంధించిన సంగీత చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమరావు పదేపదే సలహాలు ఇస్తుండడం రాజేశ్వరరావుకు నచ్చలేదు. వెంటనే ఆయన లేచి ఎన్టీఆర్ వద్దకు వెళ్లి “సార్, మీ ఇంటిలోనే మంచి సంగీత దర్శకుడు వున్నారు. ఆయన ఎవరో కాదు మీ తమ్ములుం                           గారే. వారితో చేయించుకోండి” అంటూ వెళ్ళిపోయారు. ఈ సంఘటన ఎన్.టి. ఆర్ ప్రష్టాత్మక చిత్రం ‘సీతారామ కల్యాణం’ విషయంలోనే జరిగింది. ఆ సినిమాకు తొలుత సంగీత దర్శకుడు రాజేశ్వరరావే. “కానరార కైలాస నివాసా” పాటకు స్వరకర్త రాజేశ్వరరావే. ఈమని శంకర శాస్త్రి చేత రావణాసుర అష్టకానికి, పాటకు కూడా బిట్లు స్వరపరచిన మేధావి రాజేశ్వరరావు. కానీ త్రివిక్రమరావు జోక్యం సహించలేక బయటకు వచ్చేశారు. తరవాత గాలి పెంచల నరసింహారావు ఆ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


మిస్సమ్మ (1955) సినిమా కు పింగళి రాసిన పాటలన్నీ రాజేశ్వరరావు పూర్తిచేశారు. చివరగా ‘బృందావనమది అందరిదీ’ పాటను రాజేశ్వరరావు ట్యూన్ చేస్తున్నారు. ఆయన హమ్ చేసిన ట్యూను చక్రపాణికి నచ్చలేదు. మరేదైనా ట్యూన్ వినిపించమన్నాడు. ‘’మీరే చెప్పండి సార్.. ట్యూన్ చేస్తాను’’ అని సర్కాస్టిక్ గా అన్నారు రాజేశ్వరరావు. చక్రపాణి వెంటనే తను చిన్నతనంలో వినిన ఒక పల్లెజానపదాన్ని హమ్ చేసి వినిపించాడు. ‘’అలాగే ట్యూన్ చేస్తాను’’ అని చెప్పి రాజేశ్వరరావు, తను తొలిసారి చేసిన ట్యూన్ నే మరలా వినిపించారు. ‘భేషుగ్గా వుంది’’ అని చక్రపాణి మెచ్చుకున్నాడు. హేమంత్ కుమార్ అంతటివాడు ఆ ట్యూన్ నే హిందీ చిత్రంలో అనుకరించడం ఆ పాట గొప్పతనం. ఏ.ఎం. రాజా చేత ఎన్టీఆర్ కు పాటలు పాడించే ముందు రాజేశ్వరరావు ఎన్టీఆర్ అభిప్రాయం తెలుకోవాలని ఆయన ముందు ఈ ప్రస్తావన తెచ్చారు. ఎన్టీఆర్ చాలా సమయస్పూర్తిని ప్రదర్శిస్తూ ‘’నేను నటించేవాడినే కానీ గాయకుడిని కాదు. మీరు ఎవరిచేత పాడించినా నాకు అభ్యంతరం లేదు’’ అని జవాబిచ్చారు. ఆ తరవాతే రాజేశ్వరరావు రాజా చేత అందులో పాటలు పాడించారు. 


రాజేశ్వరరావు సరదామనిషి. హాస్యప్రియత్వం ఎక్కువ. ఒకసారి ఒక నిర్మాత రాజేశ్వరరావుకు ఫోను చేసి “కారు రిపేరులో వుంది. మీరు ఆటోలో రండి” అని చెప్పారు. రాజేశ్వరరావుకు కోపమొచ్చింది. రెండు గంటలు ఆలస్యంగా స్టూడియోకి చేరుకున్నారు. నిర్మాత “సార్... బాగా ఆలస్యమైనట్లుందే” అని అడిగారు. “అవున్ సార్.. తమరు ఆటోలో రమ్మన్నారు కదా. ఎక్కడా ఆటో దొరకలేదు. ఒక టాక్సీ దొరికింది. దాన్నెక్కి ఆటోకోసం తిరిగి తిరిగి, ఆ ఆటోని పట్టుకునేసరికి ఇంత టైమయింది. ఇవిగో టాక్సీ, ఆటో బిల్లులు” అంటూ చేతికందించారు. నిర్మాత బిక్కమొగం వేశాడు. ఇదీ రాజేశ్వరరావు చమత్కార సరళి.


 జ్ఞాపకాల పరిమళాలు. -నేడు శ్రీ సాలూరి వారి జయంతి.


-ద్విభాష్యం రాజేశ్వరరావు.


' ఇంటర్వ్యూలో మీ ప్రశ్నలు సంసారపక్షంగా ఉన్నాయి సార్!....'

                                    - కళాప్రపూర్ణ శ్రీ సాలూరి రాజేశ్వరరావు. 


జనవరి 9వ తేదీ, 1984 

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఫోన్ వచ్చింది. 

"రాజేశ్వరరావు గారూ! రేపు మన స్టూడియోకి సినీ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు వస్తున్నారు. ప్రసారం నిమిత్తం వారి ఇంటర్వ్యూ తీసుకునే ఉద్దేశంలో ఉన్నాం. మా ఆకాశవాణి స్టాఫ్ కాకుండా, ఇతరులు ఎవరిచేతనైనా ఆ ఇంటర్వ్యూ చేయిద్దామని మా డైరెక్టర్ గారి ఆలోచన! రేపు ఆ ఇంటర్వ్యూ చేయడానికి మీకు వీలవుతుందేమో కనుక్కోమన్నారు....." అంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నారు! నా చెవులను నేనే నమ్మలేనంత ఆనందం!! 

"తప్పకుండా! ఇది మీరు నాకు ఇచ్చే ఒక గొప్ప అవకాశం గా నేను భావిస్తాను! ధన్యవాదాలు!!" అన్నాను ఆయన మాటలకు అడ్డుపడుతూ.

"అయితే రేపు మీరు ఉదయం పదకొండు గంటలకు స్టూడియోకు వచ్చేయండి! కాంట్రాక్ట్ ఫారం రెడీ చేసి ఉంచుతాను!" అంటూ ఫోన్ పెట్టేశారు ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్! 

                      రాజేశ్వరరావు గారు నా ఫేవరెట్ సంగీత దర్శకుడు. అటువంటి మహానుభావుణ్ణి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు రావడం అనే విషయం నాకు ఎనలేని ఆనందం కలిగించింది. మర్నాడు ఆకాశవాణికి వెళ్లి, అప్పటికే అక్కడికి వచ్చి స్టేషన్ డైరెక్టర్ గారి రూమ్ లో ఆసీనులై ఉన్న సాలూరి రాజేశ్వరరావు గారికి పాదాభివందనం చేశాను. డైరెక్టర్ గారు నా గురించి నాలుగు మాటలు చెప్పి నన్ను ఆయనకు పరిచయం చేశారు.

తర్వాత స్టూడియోలో అరగంటలో ఇంటర్వ్యూ రికార్డింగ్ అంతా పూర్తయింది.

                       ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత "మీ ప్రశ్నలు అన్నీ సంసార పక్షంగా ఉన్నాయి సార్!" అన్నారాయన. 

"అదేమిటండీ?" అంటూ అడిగాను చిన్నగా నవ్వుతూ. 

"చాలామంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలో ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తూ ఉంటారు.' సార్! పలానా వాళ్ళకి మీకు తగువు ఎందుకు వచ్చింది? లేకపోతే... ఫలానా సినిమాలో సగం పనిచేశాక ఎందుకు మానేశారు?.... చక్రపాణితో మీకు గొడవ వచ్చిందట కదా!..... దాని వివరాలు ఏమిటి?' ఇలాంటి ప్రశ్నలు  వేస్తూ ఉంటారు సార్!.... అలాంటి వాటికి సమాధానాలు చెప్పి చెప్పి విసుగెత్తి పోయాను సార్!... అందుకని మీ ప్రశ్నలన్నీ చాలా సంసారపక్షంగా ఉన్నాయని అన్నాను!" ముఖంలో ఏ భావం చూపించకుండా సంభాషణ ముగించారు.

                       ఆకాశవాణి ఆఫీసులో మిగిలిన ఫార్మలిటీస్ అన్ని పూర్తయ్యాక రాజేశ్వరరావు గారిని మా ఇంటికి లంచ్ కి ఆహ్వానించాను. ఏమాత్రం బెట్టు చేయకుండా నా ఆహ్వానం మన్నించి మా ఇంటికి వచ్చి భోజనం చేశారాయన! తర్వాత మూడు గంటల పాటు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. 

                ఆ తర్వాత "మీరు ఏమీ అనుకోకపోతే మరొకసారి  మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను నా టేప్ రికార్డర్ మీద!" అంటూ ఆయన్ని ప్రాధేయపడ్డాను." అలాగే సార్!... తప్పకుండా!" అంటూ నేను రికార్డు చేసుకుంటూ ఉండగా నా ప్రశ్నలు అన్నిటికీ మళ్ళీ ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పారు.అంతేకాకుండా, 'చల్లగాలిలో యమునా తటిపై......' పాట పాడమంటే పాడి వినిపించారు. దాంతోపాటు' ఓ యాత్రికుడా...' కూడా పాడేరు. అలా వారి పాటలతో సహా వారి గొంతు నా దగ్గర దాచుకునే అదృష్టం నాకు కలిగింది. సాయంకాలం వారిని తీసుకు వెళ్లి, వారు విడిది చేసిన హోటల్లో దింపి వచ్చాను. అది నిజంగా నా జీవితంలో మరుపురాని రోజు! 

                            తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకులలో అగ్రగణ్యులుగా వినుతికెక్కిన శ్రీ సాలూరి రాజేశ్వర రావు గారు 1922లో అక్టోబర్ 11న సాలూరు మండలంలోని శివరామపురం అనే చిన్న గ్రామం లో జన్మించారు. వారి తండ్రిగారు సన్యాసి రాజు గారు ప్రముఖ వయోలిన్ విద్వాంశులైన ద్వారం వెంకటస్వామి నాయుడు గారికి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి! పువ్వు పుట్టగానే పరిమళించిన రీతిలో రాజేశ్వరరావు గారు అతి చిన్న వయస్సులోనే అనేక రాగాలను గుర్తించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు! ఏడేళ్ల వయసు వచ్చేసరికి అన్నగారైన హనుమంతరావు గారితో కలిసి పాటకచేరీలివ్వడం, హరికథలు చెప్పడం మొదలెట్టారు. 1934 నాటికి 'బాలభాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు ఆఫ్ విజయనగరం' కంఠం గ్రామ ఫోను రికార్డుల ద్వారా మొదటిసారిగా విజయనగరం ఎల్లలు దాటి, బెంగళూరు వారి హచ్చిన్స్ గ్రామ ఫోన్ కంపెనీ ద్వారా, యావదాంధ్ర దేశానికి పరిచయమైంది.

                 ఈయన గాన మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకట దాసు,గూడవల్లి రామబ్రహ్మం గారలు తమ చిత్రం 'శ్రీకృష్ణ లీలలు'లో ఇతడిని కృష్ణుడి పాత్రధారునిగా ఎంపిక చేసుకొని 1935 లో మద్రాసు తీసుకువచ్చారు. నాలుగైదు సినిమాలలో నటించి ఆయన పాటలు ఆయనే పాడుకున్నారు! చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తయారైన 'జయప్రద' అనే చిత్రానికి పూర్తి సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీత దర్శకుడుగా ఒక చరిత్రను సృష్టించారు. 1940లో విడుదలైన 'ఇల్లాలు' సినిమా ఆయనకు సినీ సంగీత దర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చింది. 


1948 లో విడుదలైన 'చంద్రలేఖ', 1951లో వచ్చిన 'మల్లీశ్వరి' సినిమా విజయాలతో మరి రాజేశ్వరరావు గారు వెనుతిరిగి చూడలేదు!! మొత్తం ఐదు దశాబ్దాల పాటు ,సుమారు 100 చిత్రాలకు పైగా అద్భుతమైన సంగీతం అందించి, చిత్ర విజయాలకు వీరి మధుర సంగీతం ద్వారా బాటలు వేశారు!

            రాజేశ్వరరావు గారు ఎంత లౌక్యులో అంత బోళామనిషి! ఏ విషయమూ మనసులో దాచుకోవడం ఆయనకు తెలియదని అనేకమంది ఆయన గురించి పేర్కొంటారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యంగ్యంగా ఎదుటివారికి ఎలా చురకలాంటిస్తారో అనేక సందర్భాలలో మిత్రుడు శ్రీ బాలు గారు చెప్పడం కూడా మనకు తెలుసు!  సాలూరి వారి గురించి నేను విన్న ఒక సరదా విషయం మీతో పంచుకుంటాను. 

                    ఓసారి అన్నపూర్ణ వారి సినిమాకి పాటల రికార్డింగ్ జరుగుతోంది. నిర్మాత మధుసూదనరావు గారు "రాజేశ్వరరావ్!  రేపు నిన్ను తీసుకురావడానికి మన ప్రొడక్షన్ కారు రాదు. వేరే పని మీద వెళ్తోంది. అందుకని నువ్వు ట్యాక్సీ తీసుకుని వచ్చేయ్ !ఇక్కడికి రాగానే పే చేద్దాం!" అన్నారు. మర్నాడు పొద్దున్నే పది గంటలకు రికార్డింగ్. పదకొండు అయినా పన్నెండు అయినా సాలూరు వారి జాడలేదు! మధుసూదన రావు గారు, ఆర్కెస్ట్రా వారు క్షణమొక యుగంలా సాలూరి వారి కోసం నిరీక్షిస్తున్నారు! ఎట్టికేలకు పన్నెండున్నరకు రాజేశ్వరరావు గారు వచ్చారు.  దుక్కిపాటి వారు విసుగును అణిచిపెట్టుకుంటూనే, "రాజేశ్వరరావు ....ఇంత ఆలస్యం ఏంటి? టాక్సీ దొరకలేదా?... అయినా, మీ ఇల్లు మన ఆఫీసుకు దగ్గరే కదా!... అంటూ అడిగారు." అవును సార్! టాక్సీ దొరకలేదు! ఆ టాక్సీ కోసం ఆటోలో ఊరంతా వెతికి ఆఖరికి టాక్సీ పట్టుకుని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది సార్!" అన్నారు తాపీగా . సాలూరి వారి సమాధానం విన్నాక, దుక్కిపాటి వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తల పట్టుకుని ఉండిపోయారట!

       సుస్వరాలూరించిన సాలూరి వారు 1999 అక్టోబర్ 25వ తేదీన తమ 77 వ ఏట మద్రాసులో పరమపదించారు.

8, అక్టోబర్ 2024, మంగళవారం

కవిత - మెరాజ్ ఫాతిమా


 Pvr Murty 

నా చిత్రానికి 

అమ్మాయి మెరాజ్ ఫాతిమా రాసిన కవిత 


"ఆదరణ లేని

అస్తవ్యస్తమైన ఆలోచనలకు

ఒక రూపు కావాలి,


ఏపాటికీ సాటి లేని

రూపానికి 

మనో ఊరట కావాలి,


అనేక అంతర్ 

యుద్దాల తర్వాత 

ఒకింత శాంతి కావాలి,


వీడిపోయిన వారి నుండి

ఓడిపోయిన మనస్సుకు

విశ్రాంతి కావాలి,


గుండె  మంటలను ఆర్పేందుకు

కొన్ని కన్నీళ్లు కావాలి,


దుఃఖపు ముప్పెనలో  మునిగిన ముఖాన్ని దాచుకొనేందుకు 

ఓ  భరోసానిచ్చే

భుజం కావాలి.

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!

 ఈనాడు facebook లో నా చిత్రాలతో వచ్చిన వ్యాసం . 


*సాని ' దానికి మాత్రం "నీతుండొద్దా" ? 






*‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!


గురజాడ వారు ఏముహూర్తాన "కన్యాశుల్కం

"నాటకం రాశాడో కానీ, ఆంధ్రదేశంలో దాని...

ప్రకంపనలుఇంతవరకూ తగ్గలేదంటే అతిశయో

క్తి...కాదు. అందుకే...‘కన్యాశుల్కం‌'నాటికీ ,నేటికీ

ఓ దృశ్యకావ్యంగా నిలిచివుంది. మరోవందేళ్ళ

యినా  ఈ నాటకం సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటి సామాజిక సమస్యఇప్పుడు

లేదు.ఈ సమస్య సమసి పోయిచాలా కాలం అయింది.అయినా,ఈనాటకంఇప్పుడు కూడా 

ఎవర్ గ్రీన్ గా వుందంటే దానికిప్రధాన కారణం

నాటక కర్త  ఇందులోని.  పాత్రల్ని మలిచినతీరు.!


కన్యాశుల్కం అనగానే నిలువెత్తు గిరీశం  పాత్ర

మన కళ్ళముందు నిలుస్తుంది.అయితే “మధు

రవాణి "పాత్రే ఈ నాటకంలో సూత్రధారిలా కనిపిస్తుంది. గిరీశం మాయలో పడి   గురజాడ మధురవాణిని కాస్తంత నిర్లక్ష్యంచేశారనిపిస్తుం

ది.నాటకం ఆసాంతంలో ఆమె వ్యక్తిత్వాన్నిపరి

పూర్ణంగా ఆవిష్కరించలేక పోయారుగురజాడ. 

అలాగని‌ పూర్తిగానిర్లక్ష్యం కూడా చేయలేదు.

మన చేతికి ...."తీగ” ఇచ్చి, ఇక మీ ఓపిక.(లాగి

నోళ్ళకిలాగినంత )  ఊహించుకున్నోళ్ళకి'....

ఊహించుకున్నంత'అన్నట్లుమధురవాణిని  తాకీ తాక కుండా చిత్రించారనిపిస్తోంది.


ఏదైతేనేం ?.....నా దృష్టిలో మధురవాణి

"జీనియస్ " లోకం తీరు తెలిసిన జాణ.!


కరటక శాస్త్రి ఆమెను “త్రిలోక సుందరి" గా వర్ణించడాన్ని బట్టి ఆమె అందచందాల్ని... అంచనా..... వెయ్యొచ్చు"...సొగసు కత్తెల అలకలో కూడా అదో శృంగారం “ అని రామ

ప్ప పంతులన్నాడంటే ... మధురవాణి ఎంత

'సొగసైన'దోఊహించుకోవచ్చుఆమె అంత అందగత్తె కాబట్టే శిష్యుడు  మధురవాణి

నవ్వులో పట్టుబడాలని “ శిష్యుడు కోరు

కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.ఇక మధుర

వాణికి చదువు కూడా వుంది.గిరీశం దగ్గర కొంతకాలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఆమె

కు విద్య కూడా వుందని నిర్థారించొచ్చు.ఆమె

కు కేవలం ఇంగ్లీషే కాదు..సంస్కృతంలోని ‘ మృచ్ఛకటికం 'కూడా తెలుసన్న విషయం నాటకం చదివిన వారికెవరికైనా తెలుస్తుంది.

’బుద్ధిమంతురాలైన తల్లి తర్ఫీదు వల్ల ఆమె 

విద్యావతి అయిందన్న ప్రస్తావన వుంది.” 

మా తల్లి ధర్మమా అని ,ఆమె నా చెవిలో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి  .... 

"తానింత  దానైనట్లు"  మధురవాణే చెబు

తుంది.


ఇవన్నీ ఓ ఎత్తయితే ..లో మధురవాణి వ్యక్తి

త్వం ఒక యెత్తు.కన్యాశుల్కం నాటకంలో కులానికి తక్కువైనాగుణానికి ఎంతో యెక్కువ. ఈ నాటకంలో మధురవాణి కీలకమైన పాత్రే కాదు.మొత్తాన్ని ఓ మలుపు తిప్పిన పాత్ర....

ముఖ్యంగా ఆమె లౌక్యం గురించి చెప్పు...

కోవాలి.


గిరీశం కథను  తారుమారు చేయాలని చూసిన

పుడు ఆమె'చక్రం'అడ్డువేసి బుచ్చమ్మనుప్రమా

దంనుంచి కాపాడుతుంది.మరో మాట.. నాట

కంలో పాత్రల మధ్య 'చిక్కు'వేసేదిఆమే,చివర

కు.ఆ 'చిక్కు'విడగొట్టేదీ ఆమే.రామప్ప పంతు

లు లౌక్యాన్ని, , కరటకశాస్త్రికార్యాలోచనను,

గిరీశం  సమయ స్ఫూర్తిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి నూరితే వచ్చిందే ' మధురవాణి పాత్ర.!


‘వేశ్య'అనగానే చులకన,హేయ భావం స్ఫురి

స్తుంది.సమాజంలో వేశ్యలది అథమస్థానం. అయితే మధురవాణిని చూసిన వారు ‌మాత్రం ‌ ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటా

రు.


మధురవాణి వృత్తి చేత వేశ్య. అవకాశం వున్న మేరకు   విటులవద్ద  నుంచి‌ సొమ్ము లాగుతుం

ది.అదివేశ్యా ధర్మం.అంత మాత్రం చేత మధుర

వాణికి  దయాదాక్షిణ్యాలు 'సున్న' అని తలవ

రాదు వేశ్యల్ని చులకనగాక చూసేవాళ్ళకు మధురవాణి మంచి చురకే అంటించింది.


"వేశ్య అనగానే అంత చులకనా ! పంతులు గారు .? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా ?

అంటూ...ఎదురు ప్రశ్నిస్తుంది. 


అసలు ఈ పాత్ర సృష్టి కర్త గురజాడ వారి అభి

ప్రాయం ఇది.గురజాడ వారు 1909 లో వంగ

వోలు ముని సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో... వేశ్యల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.


"వేశ్యలో మానుషత్వాన్ని మరిచిపోకండి.ఆమె

సుఖదుఃఖాలు మీవిగాని,నావిగాని అయిన సుఖదుఃఖాలకుప్రాముఖ్యతలో తీసిపోవు.

సంఘంలో లెక్కలేని వ్యభిచారులైనా భర్తలు,

భార్యలూవున్నారు.స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే  వేశ్య..వారందరికన్నా అథము

రాలెట్లా అవుతుంది?  పైగా వేశ్య ఏ వివాహ ప్రమాణాన్నీ భగ్నంచేయడం లేదు వీళ్ళవలె.”.!!


పై అభిప్రాయంతోనే మధురవాణి పాత్రను గుర

జాడ సృష్టించారు.అంతే కాదు కన్యాశుల్కం...

నాటకంలో మధురవాణి పాత్రకు ఎంతపెద్దపీట

 వేశారో చూడండి.


"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి 

యీకళింగ రాజ్యంలో వుండకపోతే భగవం

తుడి  సృష్టికి ఎంత లోపం వచ్చి వుండును‌".


అని ఓ సందర్భంలో... కరటక శాస్త్రి చేత చెప్పిస్తాడు గురజాడ.


మరి సానిది అంటే ...ఒళ్ళమ్ముకునేదేనా?


సానిదానికి మాత్రం ప్రేమ ,వలపు వుండదా?


అంటేదానికీ మధురవాణినే  ఉదాహరణగా నిలబెట్టాడు గురజాడ. సౌజన్యారావును 

మనసు పడుతుంది.ప్రేమిస్తుంది‌ మధురవాణి.

అయితే తన ప్రేమను వలపును వ్యక్తీకరించడా

నికి వృత్తి న్యూనత అడ్డొస్తుంది.అందుకే మనసులో ఇలా అనుకుంటుంది మధురవాణి.

” సానిదాని వలపు మనసులోనే మణగాలి “.!!


మధురవాణికి మనసూ,రూపంమాత్రమేకాదు.

స్నేహం ,ప్రేమా కూడావున్నాయి.శృంగారంవన్నె

చెడినదగ్గర్నుంచి బంగారం కదా తేటుతేవాలి? 

ఆ బంగారాన్ని కరటక శాస్త్రికి ధారపోసింది.

ఆమె స్నేహం ఎన్ననేల? ఇక వలపా? పాపం ఆమెకి బ్రతుకే లేదు.హెడ్డు కానిస్టేబుల్ దగ్గ

ర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే.అసిరిగాడి దగ్గర్నుంచి పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కనిష్టీబుమధుర

వాణితో వుంటాడని చెప్పి నానా... యాగీ పెట్టే వారే.ఈగల్లాగ ముసిరే మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరట

కుడి శిష్యుడుమాత్రమే.!


"ఈ చిల్లంగి కళ్ళు నీకేదేవుడిచ్చాడని ",? 

వాడ్ని ముద్దు పెట్టుకుంటుంది మధురవాణి.


సౌజన్యారావును పట్టి మంచిదాన్ననిపించు

కుంది.మొత్తానికి... ' సానిదానిక్కూడా నీతి  వుంటుందన్న' విషయాన్ని గురజాడవారు. 'మధురవాణి '  పాత్ర ద్వారా బహుచక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు గురజాడ.


*దటీజ్ గురజాడ !!


*చిత్రాలు...పొన్నాడ మూర్తి.

 జ్యోతిర్మయి మళ్ళ(గజల్)


*ఎ.రజాహుస్సేన్!

  హైదరాబాద్.

18, ఆగస్టు 2024, ఆదివారం

అల్క మానవుగదా ఇకనైన అరాతకుంతలా




 ఉ.

సొక్కినదేమొ నీదు పదజోకయు తాకగ నాదు శీర్షమున్

చక్కగ యొత్తెదన్ సఖి వెచారము తగ్గగ సేవలందుమా

ఎక్కిడబోకు తూపులను ఈక్షిఖలందునె యౌర్వజాలనే

బక్కను నేను భామినిరొ భావ్యము కాదుగ కిన్కమానవా

చెక్కిట జాలువారగను చిన్కులపూసలు చింతయేలనే


పాటిబళ్ళ శేషగిరిరావు 

హైదరాబాద్ 

18.7.2024

11, ఆగస్టు 2024, ఆదివారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

నేను చిత్రీకరించిన శంకరంబాడి సుందరాచారి చిత్రానికి శ్రీమతి ఉషా మోహన్ రాజు గారు పాడిన పాట లింక్ క్రిందన  ఇస్తున్నాను. ఉష గారు ప్రఖ్యాత అమర గాయకులు KBK Mohan Raju గారి కుమార్తె. వీరి కుటుంబ సభ్యులు చిత్రకళను ప్రోత్సహిస్తూ నేను చిత్రీకరించిన చిత్రాలకు సందర్భోచితంగా స్పందిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


ఈ క్రింది లింక్ లింక్ చేసి ఉష గారు పాడిన పాటను వినండి.



https://www.facebook.com/share/v/NiRBoV9hCQxuqho7/?mibextid=oFDknk



22, జులై 2024, సోమవారం

శ్రీరామచంద్రుడు


 

నా చిత్రానికి మిత్రులు, కవిగ శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పందన యధాతధంగా

ప్రముఖ చిత్రకారులు శ్రీ PvrMurty గారు చిత్రించిన అయోధ్య రాముని చిత్రానికి నేను వ్రాసుకున్న పద్యభావన చిత్ర దాత కు ధన్యవాదాలు అభినందనలతో

జై శ్రీరామ్ 👌🙏👌

కం .

ఒకటే మాటకు నిలబడి

యొకటే సతి నీమమెంచి యుగపురుషుడవై

ఒకటే బాణము తోడుత

సకల జనుల గావుమయ్య జగదభి రామా

20, జులై 2024, శనివారం

మనము నా మధురోహలతో - పద్యం


నా చిత్రానికి శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య రచన:

శ్రీ Pvr Murty గారి అద్భుతమైన పెన్సిల్ స్కెచ్ కి

నాకలం కవిత కందరూపంలో 

అద్భుతంగా చిత్రించారు అభినందనలు సార్

కం.

మనమున మధురోహలతో

తనువెల్లా పులకరించి తమకము తోడన్

తనప్రియుని రాక కొరకై

ముని కన్నియ వేచియుండె మోహిత యగుచున్


పద్య రచన : శ్రీ వెంకటేశ్వర ప్రసాద్

18, జులై 2024, గురువారం

ఆనందనిలయ ప్రహ్లాదవరదా భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా॥పల్లవి॥ - అన్నమయ్య కీర్తన


 

ఆనందనిలయ ప్రహ్లాదవరదా
భానుశశినేత్ర జయ ప్రహ్లాదవరదా॥పల్లవి॥


పరమపురుష నిత్య ప్రహ్లాదవరదా
హరి యచ్యుతానంత ప్రహ్లాదవరదా
పరిపూర్ణ గోవింద ప్రహ్లాదవరదా
భరిత కల్యాణగుణ ప్రహ్లాదవరదా॥ఆనం॥


భవరోగసంహరణ ప్రహ్లాదవరదా
అవిరళ కేశవ ప్రహ్లాదవరదా
పవమాననుతకీర్తి ప్రహ్లాదవరదా
భవపితామహవంద్య ప్రహ్లాదవరదా॥ఆనం॥


బలయుక్త నరసింహ ప్రహ్లాదవరదా
లలిత శ్రీవేంకటాద్రి ప్రహ్లాదవరదా
ఫలితకరుణారస ప్రహ్లాదవరదా
బలివంశకారణ ప్రహ్లాదవరదా॥ఆనం !!


అన్నమయ్య కీర్తన - చిత్రాలు ః పొన్నాడ మూర్తి



5, జులై 2024, శుక్రవారం

అందం - కవిత

అందం - కవిత: మిత్రులు రాజా హుస్సేన్


అందం ..

నీ మోముదా?

ముంగురులదా?


నా మటుకు నేను

నీ హృదయ సౌందర్యాన్నే

ఇష్టపడతాను…!


బాహ్య సౌందర్యం

శిశిరమైతే…

అంతః సౌందర్యం 

వసంత శోభ.!!


(చిత్రం..పొన్నాడ మూర్తిగారు)


*ఎ.రజాహుసేన్..!!

 

3, జులై 2024, బుధవారం

కాలప్రవాహం - కవిత


 శ్రీ Pvr Murty గారి చిత్రానికి నా కవిత. 

మూర్తి గారూ ధన్యవాదాలండీ 🙏


దేవత ప్రత్యక్షమయే కాలాన

వాలిపోయే నా కనురెప్పలుతెరచి సూటిగా తనని చూడాలి 

తడబడుతూ పాలిపోయిన  నా పెదవులు  తనని చూసి

చిరునవ్వున విచ్చుకోవాలి


నా చుట్టూ ఉన్న నిశ్శబ్దపు గీతల మీదుగా

గుప్పిలి మూసుకోనున్న

గుప్పెడు గుండె సవ్వడి

తను ఆలకించాలి


గొంతు పెగిలి రాని నా ఆహ్వానం 

మన్నించి తాను వస్తే

తన ఆహ్వానానికి స్వాగతం పలికి

నా నుంచి నేనే

తనతో ప్రయాణం చేయాలి


వణికిపోయే నా చేతులకి

ఓ ఆసరా ఊతమిచ్చి

ఇక పదపదమంటూ

చివరి తెరని నా కనులపై వేసి

మౌనంగా తన వెంట 

తోడ్కొని పోయే నా నేస్తం 

రానే వచ్చిననాడు


ఆనాడు.. 


సాగిపోయే ఆ కాలంలో

తనతో నేను కలిసిపోయి


నా కాలం, నా గమనం

ఆగిపోయినదని

గమనించిననాడు

కాల ప్రవాహంలో

కనుమరుగైన శిలాఫలకమై పోతాను.


కలవల గిరిజారాణి.


ఇదివరలో భావుకలో వ్రాసిన కవిత ఇది.

29, జూన్ 2024, శనివారం

తెలగాణ్య అగ్రగణ్య తేజము - పీవీ నరసింహారావు


 నా చిత్రానికి మిత్రుడు పొన్నాడ మురళి గారి భావ వ్యక్తీకరణ

తెలగాణ్య అగ్రగణ్య తేజము, రాజ్య పూజ్యము పీవీ

ఇల నిలిచి గెలిచిన పలు ప్రజ్ఞల పండిత ప్రతిభా జీవి !!


శిల నుండి చెక్కిన సుందర శిల్పమోలే ఖ్యాతి గాంచినావు

పలుభాషలనవలీలగ నేర్చి విశ్వమున ఘనతనొందినావు !!


విలువల రాజకీయము సల్పి మేలు పదవులెన్నో చేపట్టినావు

మలుపుల కుటిల మర్మముల కౌటిల్య కౌశలము చూపినావు !!


తలవని తలపున తలుపు తట్టిన అత్యున్నత పదవి

కలి కష్ట కాలమున చేపట్టి, హస్తిన నేలిన జగజ్జెట్టీవీవు !!


మలి సంధ్యన భరత భువినేలి మేటి పాలనందించినావు

పలు విధముల విపణి వీధుల తెరిచి విత్త విస్తరణ చేసినావు !!


అలుపెరుగక శ్రమ సలిపి ఆర్ధిక పరిపుష్టి చేకూర్చినావు

నేల నలు చెరగుల మన ఖ్యాతినినుమడింపజేసినావు !!


కలనైనా ఇల మరువదు నిను...ఓ మాన్య ధన్య చిరంజీవి

మేలిమి బంగరు వన్నెల మేటి, పాములపర్తి వెంకట నరసింహ ఠీవి !!

25, జూన్ 2024, మంగళవారం

ఏకాంత సమారాధన - కవిత



Ammu Bammidi కవితకి నా చిత్రం. సమ్మతించిన అమ్ముకి ధన్యవాదాలు. శుభాశీస్సులు


ఏకాంత సమారాధన

( కృష్ణార్పణం ; శుభోదయం)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


గాలి తరంగాలకెంత ఇష్టమో..!

నీ చూపును భుజాలపై మోసుకుని

నేరుగా నా కళ్ళలోకి చేర్చాలని!!


ఎన్నాళ్ల తర్వాతో ఆ కలయిక!

వసంతంలా ఒక్క ఉదుటున 

ఆ చూపు నన్నల్లుకోగానే..

మనసు పువ్వై విరబూస్తుంది..!


ఊపిరి ఎన్ని సార్లు ప్రవహించిందో..

ఇరు మనసుల మధ్య వారధి కట్టాలని!!


పరస్పర యోగక్షేమాల పలకరింపుల్లో

గుండె అంచును 

ఎన్నిసార్లు తాకిందో సంతోషం.!


ఒకే కొమ్మకు రెండు లతలల్లుకున్నట్టు

ఒకే రేఖపై ఇరు చూపులూ ఏకమై 

అప్రమేయంగా పలికిన మౌనరాగం

ఒక్క క్షణమే అయినా..

ఆజన్మాంతం సరిపడా ప్రణయకావ్యమేగా!!


చిమ్మచీకట్లో దారి చూపే

నక్షత్రాల వెలుగు.. ఆ చూపు..!

కష్టాల చీకట్లో తోడు నిలిచే 

కిరణఖడ్గం ఆ చూపు!


రోజూ వేలాది కృత్రిమ నవ్వుల 

పలకరింపుల కన్నా..

నీ కంటి చూపుతో జరిపే

ఏకాంత సమారాధన ఒక్కటి చాలుకదా

నా ఉనికి తెలపడానికి..!!


- ఎస్. అమ్మూ బమ్మిడి



https://www.facebook.com/share/p/8mKi2q4LBz4ETYLC/?mibextid=oFDknk


20, జూన్ 2024, గురువారం

శ్రమ జీవన సౌందర్యం


నా charcoal pencil sketch చిత్రానికి Facebook లో ఓ  మిత్రుని స్పందన


సామాజిక సమస్యల మీద, శ్రమైకజీవన సౌందర్యం మీద గతంలోనూ చాలా మంది చిత్రకారులు బొమ్మలు వేశారు. తెలంగాణ సాయుధపోరాటం మీద చిత్తప్రసాద్ చరిత్రలో నిలిచే చిత్రాలు గీసాడు. యం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఏ సమాజంలో ప్రజల తమ మీద జరిగే అన్యాయాలు, అక్రమాలు. దోపీడి చెప్పలేని అశక్తతతో మౌనం దాల్చుతారో ఆ మౌనాన్ని బద్దలుచేసే బాధ్యతను కవులు,  గాయకులు,చిత్రకారులు, కళాకారులు భుజాన్నేసుకొంటారు. చైతన్యపరిచే గేయాలు, కథలు, నాటికలతో కవులు,రచయితలు, ఆలోచనలను రేకేత్తించే భావస్పోరక చిత్రాలతో చిత్రకారులు ముందుకు వస్తారు. కళ కళ కోసం కాదు దానికి సామాజీక ప్రయోజనం ఉందని భావించే వారి సృజనాత్మకత సాధారణ కళలకు భిన్నంగా ఉంటుంది. 


       ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని భావించే కవులు, కళాకారులే తమ కళను దీక్షగా సాధన చేస్తారు, మరింత మెరుగుపర్చుకొని అద్భుతాలు సృష్టస్తారు.


    మూర్తి గారు! మీ బొమ్మలు మీ గురించి చెబుతున్నాయి. తన గురించి తాను కాదు తన కళతో మాట్లాడించేవాడు ఉత్తమ కళాకారుడు

17, జూన్ 2024, సోమవారం

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹ -- గజల్


Pvr Murty  బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం...


నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹

మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే  ౹౹


ఆలోచన అంతులేని కథలెన్నో చెప్పునులే

మనజీవితమొక కథగా మార్చనివ్వు ఇలాగే ౹౹


చేయివదలి వెళ్ళకయా చేయూతవు నీవేగా

మమకారం నీ స్పర్శన పలుకనివ్వు ఇలాగే ౹౹


అనురాగపు ఆ చూపులు దాటవేయలేనులే

నీ కన్నుల కనులుకలిపి చూడనివ్వు ఇలాగే ౹౹


బంధాలే వదలినంత బలముకోలిపోములే

మనజంటే ఆదర్శం సాగనివ్వు ఇలాగే ౹౹


మరుపురాని జ్ఞాపకాలు మధురమైన తోరణాలు

అనుభూతుల నెమరవేత చిలకనివ్వు ఇలాగే ౹౹


చెమరింతలు ఎందుకులే అలుక వీడినానులే

నీ హృదయపు నీడలోన దాగనివ్వు ఇలాగే ౹౹


... వాణి కొరటమద్ది

9, జూన్ 2024, ఆదివారం

సన్నాయి పాట - కధ


 PVR మూర్తి గారి బొమ్మకు కథ.


శీర్షిక: " సన్నాయి పాట" కథ, రచన : భవాని కుమారి బెల్లంకొండ


సుబ్బారాయుడు భార్య రాజమ్మ తో కలిసి రెండో కొడుకు అచ్యుత పెళ్ళిచూపులకని బయల్దేరాడు. సుబ్బారాయుడు స్వశక్తి తో పైకి వచ్చిన మనిషి. ఆయనకు ముగ్గురు పిల్లలు , ముగ్గురిలోకి పెద్దయిన సరోజకి ఐదెకరాల పొలం కట్నం గా ఇచ్చి పెళ్ళిచేసాడు. రెండోవాడు జోగారావు. ఎక్కువ కష్టపడకుండా పైకి రావాలని, డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుండేవాడు. అందుకే అతని అందం చూసి మోహపడి చేసుకోవాలని మోజుపడిన వనజని పెళ్లి చేసుకొని , ఇల్లరికం పోయాడు. వనజ డిమాండ్ మీద ఐదెకరాలు పెద్ద కొడుక్కి రాసిచ్చాడు సుబ్బారాయుడు. . రాజమ్మ కొడుకు పరాయి వాడైపోయాడని భాధ పడటం చూసి నవ్వేవాడు సుబ్బారాయుడు. 

" ఇవ్వాళ్ళ, రేపు ఎవరుంటున్నారే కన్నోళ్ల దగ్గిర, చదువుకున్న వాళ్ళు అంతే, వ్యవసాయం చేసుకొనే వాడైనా ఇంతే,రేపు అచ్యుత అయినా మన దగ్గిర ఉంటాడా ఏమిటీ ?పెళ్లి కాగానే వేరుపడడా ఏమిటి" అంటూ భార్యని ఓదార్చేవాడు సుబ్బారాయుడు.

తండ్రి అలా మాట్లాడినప్పుడల్లా అచ్యుత తమాషాగా నవ్వి " అబ్బా నీ పెంపకం మీద నీకెంత నమ్మకం నాన్నా" అనేవాడు. 

ఇంటర్ వరకు చదివి ఆ తర్వాత కాడెత్తుకున్నాడు అచ్యుత. మిగిలిన పదెకరాల భాద్యత నెత్తికెత్తుకున్నాడు. వయసుమీద పడుతున్న సుబ్బారాయుడులో రోజు, రోజుకీ శక్తి సన్నగిల్లుతోంది. పల్లెనుడి పట్నం వలసపోయిన కూలిచేసే వాడినైనా పెళ్లిచేసుకోవటానికి అమ్మాయిలూ సిద్దపడుతున్నారుగానీ, అచ్యుత్ లాంటి యువరైతులకి మ్యాచెస్ రావటం కష్టమవుతుంది రోజు, రోజుకి. సుబ్బారాయుడుకి ఇదే చింత. పట్నానికి పాతిక కిలోమీటర్ల దూరం లోఉన్న వూరిలో ఉండటానికి కూడా అమ్మాయిలు ఇష్టపడటం లేదు.  

పట్నానికి ఆవలివైపు మరో ముప్పై కిలోమీటర్ల దూరంలో వున్న మరో చిన్న టౌన్ అది.పిలపేరు చంద్రకళ. పదోక్లాస్ చదివింది. ఇల్లు సామాన్యంగా వుంది. ముగ్గురాడపిల్లల్లో చివరిది చంద్రకళ. . పెద్ద కళ్ళు, తీరైన రూపురేఖలు, చక్కటి శరీర సౌష్టవం తో చక్కని చుక్కలా వుంది. అచ్యుత చూపు ఆమె ముక్కు మీద నిలిచింది. ముక్కుకున్న ముక్కెర గమ్మత్తుగా అనిపించింది. మనసంతా ఆ ముక్కెర లో చిక్కుకు పోయినట్టనిపించింది అచ్యుతకు. అదెందుకు పెట్టుకుందో అర్ధం కాలేదతనికి. తమవైపు ఇటువంటి ఆచారం లేదు. 

ఏతా, వాతా తేలిందేమంటే పిల్ల తండ్రికి ఇద్దరు కూతుళ్ళ ను పెళ్లి చేసి సాగనంపేసరికి , మిగిలింది రెండెకరాల మాగాణి, ఒక ఎకరం మెట్ట. ఎట్లాగో రెండు లక్షలు కూడబెట్టాడు, అందులోనే పెళ్లి ఖర్చులు, వాళ్లకిచ్చే సొమ్ము అంతా అందులోనే అంటూ చెప్పుకొచ్చాడు. రాజమ్మకి ఈ సంబంధం సుతరామూ నచ్చలేదు. తోటి రైతు ఆవేదన సుబ్బారాయుడుకి అర్ధమయ్యిందికానీ భూమి కట్నం గ ఇచ్చే వాళ్ళైతే బావుండుననుకున్నాడు. 

వెళుతూ, వెళుతూ అచ్యుత కేసి ఒకసారి చూసి, లోపలికెళ్ళింది చంద్రకళ.

.ఇంటికి తిరిగొచ్చాక అడిగాడు సుబ్బారాయుడు కొడుకుని" ఏమంటావురా?" కొడుకు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.

 అచ్యుత ఏదో అనేలోపే రాజమ్మ అన్నది," పిల్ల చక్కగా వుంది, ఈ వయసు వాళ్ళు అదొక్కటే ఆలోచిస్తారు, మంచి, చెడ్డా పెద్దవాళ్ళం మనం ఆలోచించాలిగానీ" అన్నది విసురుగా. 

 అచ్యుత మరేమీ మాట్లా డలేదు. తన వాళ్ళు తన శత్రువులు కారు. . కానీ చంద్రకళని మర్చిపోలేకుండా వున్నాడు. ఆ ముక్కెరఅతని హృదయాన్ని . గాలానికి చిక్కిన చేపపిల్లలా కలవర పెడుతోంది. పాపం, వాళ్ళ నాన్న తానేమైనా మాట్లాడతానేమోనని ఎంత ఆశగా చూసాడు! అసలు ఒకళ్ళని ఇబ్బంది పెట్టి లాగేసుకున్న భూమి తనకు సంతోషమిస్తుందా? కానీ నాన్న మాట తీసెయ్యలేకుండా వున్నాడు. ఆయన తమని ఏంటో ప్రేమతో పెంచి పెద్ద చేసాడు. కష్టజీవి. అన్నయ్య ఇల్లరికం పోయాడని చాలా భాధ పడున్నాడు ఇప్పటికీ, నాన్నకు ఏమి చెప్పాలి? నుకుంటూ పొలానికి వెళ్ళాడు.

మరో రెండు రోజుల తర్వాత కోడలు వనజ ఫోన్ చేసి, వాళ్ళ పిన్నికూతురు వున్నది, చూసిమాట్లాడుకోవచ్చని చెప్పింది. ఈ సారి అచ్యుత లేకుండా రాజమ్మని తీసుకొని వెళ్ళాడు. అచ్యుత ఏమీ మాట్లాడలేదు, నిర్లిప్తంగా ఊరుకున్నాడు. 

కోడలి తో కలిసి పిల్లని చూడటానికి వెళ్లారు. అచ్యుత మంచి పొడవు, బావుంటాడు. పిల్ల సన్నగా పీలగా వున్నది. . పిల్ల తండ్రి ఐదెకరాల పొలం, మూడు లక్షల కాష్ ఇచ్చి, పెళ్లి బాగా చేస్తామని చెప్పాడు. 

ఇంటికొచ్చాక వనజ అన్నది." వాళ్ళు మీకో విషయం చెప్పమన్నారు, మాకిచ్చినట్టే అచ్యుత పేరున ఐదెకరాలు పెట్టమన్నారు. మిగతా ఐదెకరాలు ఇప్పుడే చెరి సగం రాసిస్తే ఒప్పుకుంటామని చెప్పమన్నారు".అన్నది.

" నేనింకా బ్రతికే వున్నా కదమ్మా" కోపంగా అన్నాడు సుబ్బారాయుడు. 

"కానీ మామయ్యా, అంతా మీస్వార్జితం కదా, అచ్యుత మీతోనే ఉంటున్నాడు, రేపు మీరు మిగతా ఐదెకరాలు అచ్యుతకో, వదినకో రాస్తే, మేము అన్యాయమవమా ? అన్నది. 

రాజమ్మకి ఒళ్ళుమండిపోయింది, " చాల్లే, పెద్ద చెప్పొచ్చావు, ఇంక చాలు, మేము బ్రతికుండగానే పిండం పెట్టేలాగున్నావు. ఎవరూ మాకు పెట్టనక్కర్లేదు,ఒకడిని నీకు ధారాదత్తం చేసాంగా, ఇంక చిన్నవాడిని కూడా వదులుకోమంటావా, మా ఆస్థి, మా ఇష్టం" అంటూ సర్రున లేచి"పదయ్యా, వెళదాం" అంటూ సుబ్బారాయుడిని బయల్దేరదీసింది.

రాజమ్మ. 

అచ్యుత తెల్లవారకముందే లేచి పొలానికి వెళ్లి, కూరగాయల మళ్లకు నీరు పెట్టాడు. మనసు మనసులోలేదు, మాటి, మాటికీ ముక్కెరే గుర్తొస్తోంది. మద్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి వెళ్లాలనిపించలేదు. నిర్విరామంగా పనిచేశాడు రెండింటిదాకా.. తర్వాత వేపచెట్టు క్రింద నవారు మంచం వేసుకొని మోచేయి మొహానికి అడ్డం పెట్టుకొని పడుకున్నాడు. తండ్రి కి మనసువిప్పి చెప్పలేని అశక్తత. కంట నీరు తిరిగింది, చంద్రకళ గుర్తొచ్చి. 

మూడయినా కొడుకు భోజనానికి రాకపోయేసరికి తానే బయల్దేరి వచ్చాడు పొలానికి సుబ్బారాయుడు. . వేళకాని వేళ అలా పడుకొన్న కొడుకుని చూసి ఆలోచనలో పడ్డాడు>

 "అచ్యుతా , అచ్యుతా ఏందిరా అయ్యా ఈ టైములో పడుకున్న వేందిరా ప్రాణం బాగాలేదా ఏంటిరా?" కొడుకు నుదిటిమీద చేయివేసి చూస్తూ అన్నాడు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అచ్యుత, కొడుకు కళ్ళల్లో నీళ్లు చూసి ఖిన్నుడయ్యాడు సుబ్బారాయుడు.

పదరా అయ్యా, అన్నం తిందువుగానీ" అంటూ వెంట తెచ్చిన క్యారియర్ అచ్యుత కు ఇచ్చి, అరటి ఆకు కోసుకొచ్చి, అచ్యుత తిన్నదాకా ఉండి, ఇంటికెళ్ళాడు.ఇంటికెళ్ళగానే, రాజమ్మ" అంటూ పిలిచాడు. " నేను చెప్పేది కొంచం శాంతంగా విను. రేపు వెంకట నరసయ్యకు కబురు చేస్తాను. శుక్రవారం పూలు, పండ్లు పెట్టుకుందామని. చిన్నోడు మనసులో మాట చెప్పలేకున్నాడు. వాడికా పిల్ల బాగా నచ్చింది,వాడి మనసు మెత్తన, మనకు ఎదురు చెప్పలేక లోలోపల భాధ పడుతున్నాడు. ఎందుకు కట్నమనీ, పొలమనీ ఆశపడి వాడిని ఎందుకు భాద పెట్టాలి? మనవూర్లోనే పెళ్లిచేసి భోజనాలు ఏర్పాటు చేద్దాము, సరేనా"

రాజమ్మ ఏదో అంబోయింది." ఇంకేమీ మాట్లాడకు రాజమ్మా, మొన్న వనజ మాట్లాడిన ఆటలు విన్నావుకదా, మళ్ళీ ఆ కుటుంబంలోంచే ఇంకోపిల్ల వద్దు. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే, రెండోవాడినీ మనకు దక్కనిచ్చేలాగా లేరు, సరేనా" 

" రాజమ్మ " నీ ఇష్టమే నా ఇష్టం' అంటూ నవ్వింది.

 శుక్రవారం పిల్ల ఇంటికి పెద్ద కొడుకు , కోడలూ, కూతురు, అల్లుడు, వియ్యాలవారి తో కలిసి   

వెళ్లారు. వనజ మొహం గంటు పెట్టుకొనే ఉంది. భోజనాలయ్యాక కావాలనే పెరటి లోకి ఆఖర్న వెళ్ళాడు అచ్యుత. అతను చేయి కడుక్కుకోవటానికి నీళ్లు చేతిమీద పోస్తూ నెమ్మదిగా అన్నది చంద్రకళ" మీరుపెళ్లికి ఒప్పుకొంటారని అనుకోలేదు" అని.

చేప గాలానికి చిక్కినట్టు , నేను నీ ముక్కెరకి చిక్కానని మా నాన్న కనిపెట్టి, ఒప్పుకున్నాడు" అన్నాడు కొంటెగా అచ్యుత. . చంద్రకళ సిగ్గుపడింది ఆ మాటకి, వెళుతూ, వెళుతూ అచ్యుత ఎప్పటికి మర్చిపోలేని ప్రేమ, సిగ్గు కలబోసిన వాలుచూపు ఒకటి విసరి, లోపలి కెళ్ళింది చంద్రకళ.

8, జూన్ 2024, శనివారం

వేమవరపు రామదాసు


 వేమవరపు రామదాసు పంతులు - ఆంధ్రరాష్ట్ర ఉద్యమం (charcoal pencil sketch) 


వేమవరపు రామదాసు పంతులు (1873 - 1944) ప్రముఖ న్యాయవాది, సహకారోద్యమ ప్రముఖుడు. అఖిల భారత సహకార సంస్థల సంఘానికి అధ్యక్షుడు. 1935 నుండి 1944లో మరణించేవరకు ఇండియన్ కో-ఆపరేటివ్ రివ్యూ పత్రికకు సంపాదకత్వం వహించాడు. వేమవరపు రామదాసు కృష్ణా జిల్లాలోని వేమవరంలో 1873 అక్టోబరు నెలలో జన్మించాడు.

చాలా ఉద్యమాల మాదిరిగానే చరిత్ర, రచనలు, పత్రికలు ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి పునాదులు నిర్మించాయి. 1911లో ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో హిందూ పత్రిక ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడించింది. కొద్ది నెలల ముందు చిలుకూరి వీరభద్రరావు రచన ‘ఆంధ్రుల చరిత్ర’ను విజ్ఞాన చంద్రికా మండలి 1910లో ప్రచురించి అప్పటికే ఒక అవగాహన తెచ్చింది. జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. 1912లో కొండా వెంకటప్పయ్య, కె.గురునాథం ఆంధ్రోద్యమం’ అన్న చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు.

1912 మే నెలలో వేమవరపు రామదాసు అధ్యక్షతన నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ సమావేశంలోనే చట్టి నరసింహారావు సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, సైన్యంలో, ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా తీర్మానించారు. ఈ భావనలకు ‘దేశాభిమాని’, ‘భరతమాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణాపత్రిక’ మద్దతు పలి కాయి.

నిడదవోలు సభ నిర్ణయం మేరకు 1913, జూన్‌ 26న బాపట్లలో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. కానీ ఇలాంటి తీర్మానానికి సమయమింకా ఆసన్నం కాలేదని, వచ్చే సమావేశాలలో చర్చిద్దామని పలువురు పెద్దలు వాయిదా వేశారు. విశాఖ ఉత్తర ప్రాంతాలు, గంజాం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై వ్యతిరేకత ఉండేది. ఈ అంశంలో ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారిని కూడా సానుకూలురను చేసుకోవాలని సభ అభిప్రాయపడింది. తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది.

తొలి ఆంధ్ర మహాసభ సమావేశాలు 1913లో బాపట్లలో జరిగాయి. ఆ సభకు రెండు వేల మంది అతిధులు, 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సభకు కోస్తా, రాయలసీమ ప్రతినిధులతో పాటు, నాగపూరు, వరంగల్, హైదరాబాదులనుండి కూడా ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రమహాసభ కాంగ్రేసు పార్టీతో సన్నిహితంగా పనిచేస్తు ఉండేది. 1943లో క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న తరుణంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ సంస్థను నిషేధించింది,

( వికీపీడియా సౌజన్యంతో )

4, జూన్ 2024, మంగళవారం

జయంతి రామయ్య పంతులు



Charcoal pencil sketch 

జయంతి రామయ్య పంతులు (జూలై 18 1860 -  ఫిబ్రవరి 19, 1941) కవి శాసన పరిశోధకులు తెలుగులో వ్యవహారిక భాషా ఉద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథిక వాదులకు నాయకత్వం  వహించి పోరాడాలి దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన పొందారు.


ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రతి ఏడాది బి. ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలలోనూ ఉత్తీర్ణులైన విద్యార్థులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని ఇస్తారు.

(వికీపీడియా నుండి సేకరణ)

3, జూన్ 2024, సోమవారం

" కళాప్రపూర్ణ " ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ



 


'కళాప్రపూర్ణ' పాతూరి నాగభూషణం



నా పెన్సిల్ చిత్రం 

పాతూరి నాగభూషణం (20 ఆగష్టు 1907 - 24 జూలై 1987) భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమానికి డోయెన్‌గా వర్ణించబడ్డారు. 

పాతూరి జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు మరియు గాంధీజీ  యొక్క గొప్ప అనుచరుడు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడంలో, వయోజన అక్షరాస్యత ప్రచారంలో Andhrapradesh Library Association బలోపేతం చేయడంలో , గ్రంథాలయ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి లైబ్రరీ పాఠశాలను స్థాపించడం మరియు రాష్ట్ర ప్రభుత్వ ధృవీకరణ కింద గ్రంథాలయ విద్యను అందించడం మరియు పుస్తకాలను ప్రచురించడంలో ఆయన చేసిన కృషి గమనించదగినది. , పీరియాడికల్స్, LIS పాఠ్యపుస్తకాలు.  ఈయన విజయవాడలోని సర్వోత్తమ గ్రంధాలయం స్థాపకుడు.   

సౌజన్యం : వికీపీడియా 

30, మే 2024, గురువారం

గిడుగు వెంకట సీతాపతి

"కళాప్రపూర్ణ " గిడుగు వెంకట సీతాపతి charcoal pencil sketch 

గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 - ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి. 

వీరు నటించిన కొన్ని సినిమాలు పల్నాటి యుద్ధం(1947) భక్తిమాల(1941) రైతుబిడ్డ(1939) పంతులమ్మ(1943) సేకరణ: వికీపీడియా

గొట్టిపాటి బ్రహ్మయ్య - స్వాతంత్ర్య సమరయోధుడు

charcoal pencil sketch (drawn from source Wikipedia) గొట్టిపాటి బ్రహ్మయ్య (1889-1984) రైతు పెద్ద అను బిరుదుతో పేరు పొందిన స్వాతంత్ర్య సమర యోధుడు. భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ (1982) అవార్డు గ్రహీత. 

గొట్టిపాటి బ్రహ్మయ్య గారు కృష్ణా జిల్లాలోని చినకళ్ళేపల్లి లో1889 డిసెంబరు 3 న జన్మించారు. 1917లో, యుక్తవయసులోనే ఆయన గ్రంథాలయోద్యమము, వయోజన విద్యలపై దృష్టి సారించారు. 1922-23లో జిల్లా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసారు. 1923-29లో కృష్ణా జిల్లా ఖాదీ బోర్డుకి అధ్యక్షునిగా ఉన్నారు. స్వాతంత్ర్య సమర యోధునిగా ఆయన జమీందార్ రైతు ఉద్యమంలో ఆచార్య ఎన్.జి.రంగా గారితో కలసి పాల్గోన్నారు, "సైమన్‌ కమిషను" బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం మున్నగు పలు కార్యక్రమాలలో పాలుపంచుకుని, పెక్కు దినాలు జైలుపాలయ్యారు. స్వాతంత్ర్యానంతరం ఆయన 1962లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 1964 జూలై 25 నుండి 1968 జూన్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షునిగా పనిచేసారు. సౌజన్యం : వికీపీడియా

29, మే 2024, బుధవారం

దివాకర్ల వేంకటావధాని -

charcoal pencil sketch . .
charcoal pencil sketch దివాకర్ల వెంకటావధాని (23 జూన్ 1911 – 21 అక్టోబర్ 1986) ఇతను తెలుగు పండితుడు కూడా. అష్ట దిగ్గజాలచే కృష్ణదేవరాయల ఆస్థానంలో జరిగిన కవిత్వ నివాళి-సమ్మేళనం యొక్క పునఃప్రతిపాదన అయిన భువన విజయం అనే వేదిక-విలువైన సాహిత్య లక్షణాన్ని అతను సృష్టించాడు. ఆసక్తి కలవారు మరిన్ని వివరాలు అంతర్జాలంలో సేకరించగలరు.

28, మే 2024, మంగళవారం

'కళాప్రపూర్ణ' నటరాజు రామకృష్ణ

నటరాజ రామకృష్ణ (1933 మార్చి 21 - 2011 జూన్ 7) కూచిపూడి నాట్య కళాకారుడు. ఇండోనేషియా లోని బాలి ద్వీపంలో జన్మించాడు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చాడు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. (charcoal pencil sketch}
pencil sketch

27, మే 2024, సోమవారం

'గ్రంథాలయ పితామహుడు' అయ్యంకి వెంకటరమణయ్య


అయ్యంకి వెంకట రమణయ్య (1890-1979) గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు, పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించాడు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచాడు.

భారత ప్రభుత్వం వీరు చేసిన కృషిని గుర్తించి పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది.

చర్ల గణపతి శాస్త్రి

Pen and ink sketch

చర్ల గణపతిశాస్త్రి (జనవరి 1, 1909 - ఆగష్టు 16, 1996) వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన జనవరి 1, 1909 సంవత్సరంలో చర్ల నారాయణ శాస్త్రి, వెంకమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్థిదశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు. ఈయన తొలి అనువాద కావ్యం మేఘ సందేశం (సంస్కృతం) 1927లో పూర్తయింది. తరువాతి కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, స్వతంత్రదీక్ష, బిల్హణ చరిత్ర, రఘువంశము,సాహిత్య సౌందర్య దర్శనం, వర్ధమాన మహావీరుడు,నారాయణీయ వ్యాఖ్యానము, భగవద్గీత, చీకటి జ్యోతి. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించాడు. లియోటాల్ స్టాయ్ ఆంగ్లంలో రచించిన నవలను చీకటిలో జ్యోతి పేరుతో తెలుగులోనికి గణపతిశాస్త్రి అనువదించారు. ఈయన జీవిత కాలమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేద పండితుడుగా, మత సంబంధ సలహా సంఘ సభ్యుడుగా, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆస్థాన విద్వాంసుడుగా తన అనుభవాన్ని పంచాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళా ప్రపూర్ణతో గౌరవించింది. భారత ప్రభుత్వం ఈయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈయన ఆగష్టు 16, 1996 సంవత్సరంలో పరమపదించాడు. 

 సౌజన్యం : వికీపీడియా

26, మే 2024, ఆదివారం

ఇందరికీ అభయంబులిచ్చు చేయి - అన్నమయ్య కీర్తన

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ‖ వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి | కలికియగు భూకాంత కాగలించిన చేయి వలవైన కొనగోల్ల వాడిచేయి ‖ తనివోక బలి చేత దానమడిగిన చేయి వొనరంగ భూ దాన మొసగు చేయి | మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి ఎనయ నాగేలు ధరియించు చేయి ‖ పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి | తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ‖

చిత్రపు నారాయణమూర్తి

pencil sketch చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది



 చిత్రపు నారాయణమూర్తి  - 


https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%81_%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF

రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు - chaarcoal పెన్సిల్ స్కెచ్

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు పిఠాపురం సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు. ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. 1911, మే 12 న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో జయంతి రామయ్య పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. జయంతి రామయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు అని నామకరణం చేశారు. మరిన్ని వివరాలు క్రింది లింకు క్లిక్ చేసి చదవగలరు.





https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%AE%E0%B0%B9%E0%B1%80%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81

23, మే 2024, గురువారం

పండిత గోపదేవ్



Charcoal pencil sketch 

పండిత గోపదేవ్ (జులై 301896 - అక్టోబర్ 221996సంస్కృతములో మహాపండితుడు, తెలుగునాట ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు.


11, మే 2024, శనివారం

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!! - గజల్



నా చిత్రానికి శ్రీమతి వాణి గారి రచన.

దూరాలను ఓపలేను ఒదగనివ్వు గుండెల్లో..!!
మౌనాలను మోయలేను ఒలకనివ్వు గుండెల్లో..!

ఎడబాటును కన్నీళ్ళకు కానుకగా ఇచ్చాను
నీఎదసడి వింటున్నా చేరనివ్వు గుండెల్లో ..!

భారమైన కాలానికి జ్ఞాపకాలు తోడైనవి
ప్రతీక్షణం మనదౌతూ బ్రతకనివ్వు గుండెల్లో..!

ఎన్నెన్నో ప్రశ్నలులే మనసులోన అలజడిలే
మమకారపు అందాలను వెతకనివ్వు గుండెల్లో..!

నువ్వొకటి నేనొకటి కాదు కాదు ఇకమీదట
మనమౌతు సంబరాలు చెయ్యనివ్వు గుండెల్లో.  !

......వాణి కొరటమద్ది

Pic Pvr Murty  ధన్యవాదాలు బాబాయ్ గారు  🙏

10, మే 2024, శుక్రవారం

నువ్వు నేను


నా చిత్రానికి అడపా పద్మ గారి  కవిత


శీర్షిక: నువ్వు-నేను

రచన: అడపా పద్మ.


సుప్రభాతంతో పులకించే 

వేకువ నేనైతే

ప్రత్యూషాన ఆవరించిన పూల పరిమళం నీవు

ఉషస్సులో ఉదయుంచే రవికిరణం నేనైతే

చిరు కిరణాల స్పర్శకి విరబూసే కమలం నీవు

ప్రకాశించే శశికాంతుడ నేనైతే

వికసించే కోనేటి కలువ నీవు

చైత్రాన చిగురించే మావిచిగురు

నేనైతే

రాగాలు పలికే 

ఎలకోయుల నీవు

తారంగమాడే సారంగం నేనైతే

వర్ణాలు విరజిమ్మే హరివిల్లు నీవు

అవధులు దాటని అనంత సాగరుడ నేనైతే

నయగారంతో నన్ను చేరుకొనే నదీకన్య నీవు

చెలీ! ఒకరి కోసం ఒకరుగా పుట్టిన మన కలయిక అపురూప సంగమం!

అడపా పద్మ

సమాప్తం.

పినపాల వెంకట దాసు - సినిమా పంపిణీదారుడు, స్టూడియో అధినేత, సినీ నిర్మాత - charcoal pencil sketch


పినపాల వెంకటదాసు - charcoal pencil sketch


పి.వి.దాసు గా ప్రసిద్ధిచెందిన పినపాల వెంకటదాసు (1870 - 1936)  తొలి రోజుల్లో తెలుగు  సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత. 

వీరు బందరు, రేపల్లెలో సినిమా హాళ్ల నిర్మించడమే కాకుండా టి.రాజన్, సి.డి.సామి, సి.పి.సారథి, జయంతీలాల్ థాకరేలతో కలసి 1934లో వేలు పిక్చర్స్ ప్రారంభించారు.  మద్రాసులో  తొట్టతొలి టాకీ స్టూడియో వేల్ పిక్చర్స్ స్టూడియో. అంతకు ముందు సినీ నిర్మాతలు బొంబాయి, కలకత్తా, కొల్హాపూరు, పూణే లోని సాంకేతికులపై ఆధారపడేవారు. ఈ స్టూడియో నాలుగేళ్ళ పాటే నిలిచినా తమిళ, తెలుగు  సినీ నిర్మాణంతో మహోన్నతమైన పాత్రపోషించింది.  మద్రాసులోనే  నిర్మాణానికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసింది. వేల్ పిక్చర్స్ పతాకంపై వెంకటదాసు సీతాకళ్యాణం కృష్ణలీలలు, మాయాబజార్ మొదలైన చిత్రాలను నిర్మించారు. ప్రభాత్ పిక్చర్స్ వారి తమిళ సినిమా ఆధారంగా ఈయన తెలుగులో తీసిన సీతాకళ్యాణం సినిమా, మద్రాసులో నిర్మించబడిన తొలి తెలుగు చలన చిత్రం. .  . తన స్వస్థలమైన బందరులో మునిసిపల్ కౌన్సిల్ సభ్యులుగాను, జిల్లా బోర్డు సభ్యులుగాను పనిచేశారు. ఈయన మహోన్నతంగా తీయాలనుకున్న  మాయాబజార్  సినిమా నిర్మాణము ఇంకా పూర్తికాక మునుపే వెంకటదాసు   1936 మే 10  తేదీన పరమపదించారు. పి.వి.దాసు మరణానంతరం వేల్‌ పిక్చర్స్ కనుమరుగై నరసు స్టూడియోస్ పేరుతో రూపాంతరం చెందింది.


credit : Wikipedia 

ముందు చూపు కలిగి - ఆటవెలది

ఎంత చక్కటి చిత్రమో 😍 ఆటవెలది // ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు  కన్ను మూసి మంచి కలలు గనుచు  హాయిననుభవించు రేయి పగలు  యంత దూర దృష్టి వింత...