11, మార్చి 2021, గురువారం

ఓం నమశ్శివాయ



నా చిత్రానికి శ్రీమతి పద్మజ మంత్రాల గారి పద్యాలు.

---------------------------------------------------------------------

చిత్రకారులు శ్రీ పొన్నాడ మూర్తి గారికి ధన్యవాదాలతో...

🙏
(1)
నీలగళా! హరా! యనుచు నిత్యము భక్తిగ నిన్ను గొల్తురా!
మాలిమి తోడ ముక్తిగొను మార్గము తెల్పుమయా నిరామయా!
శూలధరా! సురేశ! దయ జూపర! శంకర! జాలమేలయా!
జాలిగ వేడుచుంటినయ చంద్రధరా! నను బ్రోవ రావయా!
(2)
పన్నగభూషణా! పతితపావన! పాపవిమోచనా! భవా!
కన్నులు మూడు గల్గినను గాంచవదేలర నాదు బాధలన్!
మిన్నగ పూజలెన్నిటినొ మిక్కిలి శ్రద్ధగ జేసితిన్ కదా!
నన్ను పరీక్ష చేయతగునా పరమేశ్వర! పార్వతీప్రియా!
(3)
అంబను గూడి యుందువు దయామయ చల్లని మంచుకొండపై
చెంబెడు నీరు పోయగనె చింతలు దీర్తువు లింగధారివై
డంబములేమి కోరనయ లౌక్యము నీయుమయా! జటాధరా!
సాంబ! సదాశివా! శరణు! సద్గతి నీయర! జంగమేశ్వరా!

--------------------------------------------------------------------------------------------------------

మిత్రులు శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ గారి పద్య స్పందన.

ఉత్పలమాల

ఆకాశమంత టెత్తునను యాహరు గాంచగ శైవ రాత్రినిన్
దాకియు భక్తిభావ మతి తన్మయ మందును నాట్యమాడగన్
జీకటి దొల్గి వెల్గులతి శీఘ్రము వ్యాపన బొందుచందమున్
భీకర నాస్తికుందయిన బ్రెరితు డౌచును కేలు మోడ్చుగా




కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...