16, మార్చి 2016, బుధవారం

మనసునిండ జ్ఞాపకాల నీడలెన్నొ దాగున్నవి - 'హంసగీతి' గజల్ - పెన్సిల్ చిత్రం

'తెలుగు గజల్' గ్రూపు లో వస్తున్న గజల్లు చాలా భావయుక్తంగా, అద్భుతంగా ఉంటున్నాయి. ఆ గజల్లు చదువుతుంటే వాటికి తగ్గ బొమ్మ వెయ్యాలనిపించింది. వేసాను. అది చూసి ఈ గజల్ గ్రూప్ admin Jyothirmayi Malla Gazal గారు ఓ శీర్షిక ఏర్పాటు చేసి ప్రతి బుధవారం నేను ఎంపిక చేసుకున్న గజల్ కి ('గజల్ సుమాలు' పుస్తకం నుండి కాని, తెలుగు గజల్ గ్ర్రూప్ నుండి కాని) 'బొమ్మలు చెప్పిన గజల్లు" శీర్షిక తో ఓ బొమ్మ వేసే అవకాశం నాకు కల్పించారు. ఈ బుధవారం నుండి ఈ ప్రక్రియ ప్రారంభించాము. మిత్రులందరూ ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు 'హంసగీతి' గారి మనసుకు హత్తుకునే అద్భుత గజల్ కి నా బొమ్మ post చేసాను. ఆ గజల్ ని క్రింద పొందుపరుస్తున్నాను.

మనసునిండ జ్ఞాపకాల నీడలెన్నొ దాగున్నవి
కనులనిండ కనిపించని వ్యధలు ఎన్నొ దాగున్నవి
నాన్నగారి గారాబం మరువలేను ఎప్పటికీ
గతమంతా చిన్ననాటి మమతలెన్నొ దాగున్నవి
చేయిపట్టి నడిపించిన నాన్నలేక దిగులాయే
ఒంటరైన బ్రతుకంతా కలతలెన్నొ దాగున్నవి

చిన్నప్పుడు అలుకబూని నేను ఎక్కె అటకమీద
నాన్న చేత కొనిపించిన బొమ్మలెన్నొ దాగున్నవి

ఆటలాడి అలిసిపోయి నాన్నఒడిలొ నేర్చుకున్న 
మాటలలో తేటతెలుగు పాటలెన్నొ దాగున్నవి

భయపడితే బుజ్జగించి వెన్నుతట్టి ధైర్యపరిచె
నాన్నగారి పలుకులలో నీతులెన్నొ దాగున్నవి

కన్నతండ్రి మమకారం మరువలేని హంసగీతి
రాతలలో కళ్ళనీళ్ళ ధారలెన్నొ దాగున్నవి

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...