30, మార్చి 2016, బుధవారం

మీనాకుమారి - పెన్సిల్ చిత్రం - Meena Kumari - Pencil drawing

ఈ రోజు మహా నటి, ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి వర్ధంతి. నా పెన్సిల్ చిత్రం ద్వారా ఆ మహానటికి నా నివాళి అర్పిస్తున్నాను.  ఈ సందర్భంగా www.palapitta.net లో శ్రీ వంశీకృష్ట్న గారి వ్యాసాన్ని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ క్రింద పొందుపరుస్తున్నాను.

మీనా కుమారి…
ఈ పేరు వినగానే ఎవరికయినా పాకీజా, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌, బైజు బావ్‌రా లాంటి హిందీ క్లాసిక్‌ సినిమాలు గుర్తుకొస్తాయి. కాని నాకు మాత్రం ఒక అందమైన తాజ్‌మహల్‌ గుర్తుకొస్తుంది.
తాజ్‌మహల్‌ను డాక్టర్‌ సి.నారాయణరెడ్డి గారు ‘కాలం చెక్కిట కన్నీటి చుక్క’ అని అభివర్ణించారు.
మీనా కుమారి కూడా తాజ్‌మహల్‌లాగే అందమయినది.
తాజ్‌ మహల్‌ కూడా మీనాకుమారిలాగే అద్భుతమయినది.
తాజ్‌మహల్‌ విషాద సౌందర్య బీభత్సానికి ఎలా ప్రతీకో మీనా కుమారి కూడా జీవన విషాద గాద్గదిక్యానికి ఒక సంకేతం.
‘మహజ బీన్‌ బనో’ మీనాకుమారి అసు పేరు. తల్లిదండ్రుల బవంతం మీద పదేళ్ళ వయసులోనే ముఖానికి రంగు వేసుకుంది. అందరు పిల్లల్లాగే  స్కూల్ కి వెళ్ళి  చదువుకోవాలి అన్నది మీనా కుమారి లోలోపలి కోరిక. కానీ తన ఇష్టానికి విరుద్ధంగా సినిమాలోకి రావసి వచ్చింది. జీవితం మొట్టమొదటిసారి మీనా కుమారిని కొట్టిన కమ్చీ దెబ్బ అది. జీవితం మీనాకుమారిని అలా దగా చేసినా సమాజానికి మాత్రం గొప్ప మేలునే చేసింది. ఒక అపురూపమయిన, అద్భుతమయిన నటిని భారతీయ సమాజం సొంతం చేసుకోగలిగింది.
మొత్తం 90కి పైగా సినిమాలో నటించిన మీనా కుమారి హిందీ సినిమా స్వర్ణ యుగానికి అగణితమయిన కాంట్రిబ్యూషన్‌ అందించింది.
పాకీజా, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌, బైజు బావ్‌రా, బహూ బేగమ్‌, ఫూల్‌ ఔర్‌ పత్తర్‌, దిల్‌ అప్‌నా ఔర్‌ ప్రీత్‌ పరాయీ, దిల్‌ ఏక్‌ మందిర్‌, పరిణీత ఇలా చెప్పుకుంటూ పోతే తను నటించిన సినిమాలు అన్నింటినీ ఉదహరించవసిందే.
భర్త ప్రేమ కోసం తనను తాను కొవ్వొత్తిలాగా కరిగించుకున్న చిన్న కోడలిని (సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌)ను ఎవరు మాత్రం మరచి పోగరు? జ్ఞాపకానికీ, వాస్తవానికీ మధ్య ప్రేమకీ కోపానికీ మధ్య ఊయలూగుతూ, తనను తాను మర్చిపోయిన ‘మిస్‌ మేరీ’ని ఎవరు మాత్రం హృదయంలో నుండి నిర్దాక్షిణ్యంగా బయటకు తోసి వేయలగరు? తను మార్కెట్‌లో సరుకయినా సరే, తనను కొనుక్కునే హైయ్యెస్ట్‌ బిడ్డర్‌ ఎవరు అవుతారా? అని ఎదురు చూస్తూ కలను కన్నీటి అలలుగా మార్చుకున్న ‘వేశ్య’ (పాకీజా)తో ఎవరు మాత్రం మనసులో నుండి బయటకు పంపించగరు?
తన మొట్టమొదటి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును ‘బైజు బావ్‌రా’ సినిమాకు అందుకున్న మీనాకుమారి ఫిలిమ్‌ అవార్డులో ఒక అరుదయిన ఫీట్‌ను సాధించింది. 1962లో తను నటించిన మూడు సినిమాలు ‘ఆర్తి, మైనే చుప్‌ రహూంగి, సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’ లో ఉత్తమ నటి విభాగంలో పోటీ పడ్డాయి. ‘సాహిబ్‌ బీబీ ఔర్‌ గులామ్‌’లో ఆమె నటనకి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు వరించింది.
కమల్‌ అమ్రోహితో మీనా కుమారి ప్రేమ, పరిణయం, విడిపోవడం జీవితం ఆవిడని కొట్టిన రెండవ కమ్చీ దెబ్బ. రెండు బలమయిన వ్యక్తిత్వా మధ్య ఘర్షణ అది.
14 సంవత్సరాల పాటు ‘పాకీజా’ సినిమాతో తన ప్రయాణం జీవితం కంటే విచిత్రమయినది.
కళ జీవితాన్ని, జీవితం కళనూ అనుకరిస్తాయి. రెండూ పరస్పర పూరకాలు అనడానికి మీనాకుమారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. తన జీవితంలో ప్రేమ కోసం పరితపించినట్లుగానే తన సినిమాలో కూడా ప్రేమ కోసం ఆమె అన్వేషించింది. తన సినిమాలో మాదక ద్రవ్యాలకి అలవాటు పడినట్టుగానే తన జీవితంలోనూ మాదకద్రవ్యాలకి అలవాటు పడిపోయింది. ఫ్లడ్‌లైట్ల వెలుగు నీడల మధ్యన, అదృష్టం, దురదృష్టం దోబూచులు ఆడినట్లుగానే, ప్రేమ, పరాభవాల మధ్య ఆవిడ జీవితం ఊయలూగింది.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే ‘మీనా కుమారి’ మంచి కవయిత్రి. గొప్ప దు:ఖం కలిగినా, చెప్పలేనంత ఆనందం కలి గినా ఆవిడ అక్షరాల మధ్యన తనను తాను సాంత్వన పర్చుకునేది. అక్షరాలు తమ విశాలమయిన బాహువులలో ఆమెను పొదివి పట్టుకుని ఓదార్చేవి. ఆవిడ మరణానంతరం ఉర్దూలో ఆవిడ రాసిన కవితన్నింటినీ నూరుర్‌ హసన్‌ ఇంగ్లీషులోకి అనువదించి ‘మీనాకుమారి.ది.పొయెట్‌ ‘ఎ లైఫ్‌ బియాండ్‌ సినిమా’ పేరుతో ప్రచురించాడు.
తన కవిత నిండా దు:ఖం, పోగొట్టుకున్న భావన, తనకు తానే పరాయీకరణ చెందిన అనుభవమూ, ఒంటరితనం ముప్పిరిగొని ఉంటాయి. మృత్యువు అంటే భయం కాదు కానీ, అది అందించే శాంతి పట్ల ప్రేమ తన కవితలో బలంగా వ్యక్తమవుతుంది. జీవితం నుండి పక్కకు జరుగుతూ, కలిసిపోతూ తను చేసిన ప్రయాణం, పొందిన ఉద్విగ్నత, తన అక్షరాలో అక్షరాలా కనిపిస్తాయి.
‘‘జిందగీ యేహై’’ అనే కవిత చూడండి.
‘‘ఉదయాస్తమయాల మధ్య
ఇతరు కోసం మనం ఎన్నో చేస్తాము
ఆ జీవన దృశ్యం అద్భుతంగా ఉంటుంది.
కానీ ఆ దృశ్యంలో మన ఆత్మ వికసించదు…
జీవితం ఏమిటని హృదయం
పదే పదే ప్రశ్నిస్తుంది?
దు:ఖాగ్ని నీడ వెనుక ఆత్మ కనుమరుగవుతుంది.
నిరాశామయ ధూమ వలుయాలు
బాధా మేఘాలు జీవితం అయితే
నా హృదయం అవిశ్రాంతంగా పరితపిస్తుంది
మరణం అంటే ఏమిటని?
ప్రేమ ఒక కల
దాని భవిష్యత్‌ చిత్రపటం గురించి అడగకు
ప్రేమకు విశ్వసనీయంగా ఉన్నందుకు
నేను పొందిన శిక్ష గురించీ అడగకు’’
మీనా కుమారి కేవలం  కవిత్వం మాత్రమే రాసి వుంటే ఎంత గొప్ప పేరు వచ్చి ఉండేదో కదా! దు:ఖాగ్ని నీడ వెనుక అన్న పదబంధం ఏ చేయి తిరిగిన కవి కల్పనకీ తీసిపోదు.
తన ‘‘ఖాళీ దుకాన్‌’’ అనే కవిత చూడండి.
‘‘కామెందుకిaలా ఇన్నిన్ని వస్తువును
నా హృదయపు వాకిలి ముందు పరిచింది?
ఇందులో నేను కొనగ వస్తువులేవి?
కీర్తి కాంక్ష కాయితం పూలు
సంతోషాన్నిచ్చే జీవంలేని బొమ్మలు
అద్దాల బీరువాలో అందంగా బంధించిన
సంపద అనే కొవ్వొత్తి గుళికలు
కాలం ఇన్నిన్ని వస్తువులను
నా హృదయపు వాకిలి ముందు పరిచింది ఎందుకు?
ఇవి కాదు నేను కోరుకున్నది.
దహించుకుపోయే నయనాలను
సాంత్వన పర్చగ ఒక అందమయిన కలలాంటి ప్రేమ
నాకు కావాలి.
అశాంతితో వివిల్లాడిపోయే ఆత్మను
సాంత్వన పర్చగల ఒక అద్భుతమయిన సాన్నిహిత్యం
నాకు కావాలి.
కాలమనే ఈ ఖాళీ దుకాణం
ఇవేవే నాకు అందించదు.
జీవితం సప్తవర్ణ సంశోభితం అనుకుంటాం కానీ… అది అందరికీ కాదు. మీనాకుమారి పదే పదే చెప్తోంది. కాలం  అనే ఖాళీ దుకాణంలో అందరికీ అన్నీ దొరుకుతాయి. కానీ ఎవరికి కావలసింది వారికి దొరకదు. విరోధాభాస అంటే ఇదేనేమో!
మన సావిత్రిలాగే మత్తుకి బానిసయి 40 సంవత్సరాల అతి చిన్న వయసులోనే మీనాకుమారి మనని వీడిపోయింది.
మానవ వేదన, చిరంజీవి.
మీనాకుమారి చిరంజీవి.
సినారె చెప్పిన తాజ్‌మహల్‌లాగే మీనాకుమారి
‘‘కాలం చెక్కిట కన్నీటి చుక్క’’.



2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


కాలం చెక్కిన కన్నీటి చుక్కకి
పొన్నాడ కలము ఒత్తుగ చిత్రం !


మీనా కుమారి సినిమా
లోనటి! మేలుక వయిత్రి! లోకము జూసెన్
ఆ నటన అద్భుత ముగద !
ఆనా టికబురు లజూచి అచ్చెరువు గనన్ !

జిలేబి

Unknown చెప్పారు...

This is simply marvelous.I insist you to review this and let me know ► https://www.youtube.com/watch?v=4cH5eqk1wf4

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...