6, మే 2021, గురువారం

పిఠాపురం నాగేశ్వరరావు


 My pencil sketch of Pithapuram Nageswara Rao, an excellent singer of Telugu cinema


పుట్టిన ఊరు నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం (పాతర్లగడ్డ} నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది - పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. తెలుగు సినీ స్వర్ణ యుగంలో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది - పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో 'మంగళసూత్రం' సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే 'చంద్రలేఖ' చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి 'అవేకళ్ళు' చిత్రంలో పాడిన 'మా ఊళ్ళో ఒక పడుచుకుంది', మాధవపెద్ది తో కలిసి 'కులగోత్రాలు' కోసం పాడిన 'అయ్యయ్యో... జేబులో డబ్బులు పోయెనే' ఇంకా 'వెంకటేశ్వర మహత్యం' చిత్రం లో 'పదవే పోదాము గౌరీ పరమేశ్వరుని చూడ..' వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. చివరగా 1978లో 'బొమ్మరిల్లు' సినిమాలో ఓ పాట పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి! (సేకరణ : ఇక్కడా అక్కడా)

facebook లో ఈ పోస్ట్ చూసిన మిత్రులు శ్రీ సాయి గణేష్ పురాణం గారు నాకు తెలియని విషయాలు కొన్ని తెలియజేశారు. వారి నా పోస్ట్ కి ఇచ్చిన వ్యాఖ్య ని క్రిందన యథాతధంగా పొందుపరుస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు:


"విజయనగరం పనిమీద వెళ్ళినప్పుడు తప్పకుండా సుశీలమ్మ నాన్నగార్ని కలిసేవారు పిఠాపురం. సుశీలమ్మ టాలెంట్ ను గమనించి పెండ్యాలకు చెప్పేరు. పెండ్యాల నాకు ఆ అమ్మాయి తెలుసు పాడిద్దాం అని చెప్పి సుశీలమ్మకు కన్నతల్లి సినిమాలో పాడించాడు. ఆ తరువాత జరిగింది చరిత్రే. అందుకే ఈరోజుకీ సుశీలమ్మ పిఠాపురం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.
అలాగే ఉమాసుందరి సినిమాలో మాష్టారితో పాడిన పాట "నమ్మకురా ఇల్లాలు పిల్లలు" పాటకి మాష్టారు ముగ్ధులైపోయారు. ఎంతగానో పిఠాపురంను అభినందించారు."

కామెంట్‌లు లేవు:

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...