22, ఏప్రిల్ 2016, శుక్రవారం

సీతా స్వయంవరం

Facebook లో సుధాకర్ యడవల్లి గారి టపా. నాకు చాలా ఆశక్తి కలిగి నా ఈ బ్లాగులో పొందుపరుచుకుంటున్నాను. పండితులు, జానపదులు సీతా స్వయంవర ఘట్టం గురించి తమతమ శైలిలో ఎలా స్పందిస్తారో చాలా బాగా వివరించారు.
సీతా రామ కల్యాణం :
1) కనక లతాభ వధూమణి
చనెనంత వసుంధరాత్మ జాత నయముగా
తన హృదయేశుని జేరగ
ఘన భుజు నాశ్రితుల పాలి కల్ప మహీజున్ !
2) శ్రీ రంజిల్లెడు స్వర్ణ భూషణములన్ జెన్నొందగా దాల్చి, సీ
తా రామామణి, మంద హాస ముఖి చేత: పంకజాతమ్ము సొం
పారన్ కాంచన హారమొండు గొని యాహ్లాదముతో వచ్చి శో
భారాముంగని వేసె వాని గళమందా హారమున్ ప్రేమతో.
అని శ్రీ ఆత్మ స్వరూప (శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావు, (గొల్లాది అగ్రహారం, వయా బొబ్బిలి, విజయనగరం జిల్లా) గారు తన స్వీయ పద్య కావ్య రచన “ శ్రీ మదధ్యాత్మ రామాయణం” లో సీత స్వయంవరం ఘట్టాన్ని వర్ణిస్తే -
జనపదులు మాత్రం స్వయంవర ఘట్టాన్ని తమదైన శైలి లో ముచ్చటగా, తాదాత్మ్యం జెందుతూ, పరమానందంగా, అతి సున్నితమైన, అర్ధమైన శైలిలో పాడుకుంటూ ఉంటారు. ఆ స్వయంవర వర్ణన ఎలాగుంటుందో దాని “భావం” మాత్రం చూడండి. “ఫెళ్ళున విల్లు విరిగింది. నీలమేఘ శ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, ఆజానుబాహుడు, ఆ దివ్య మంగళ రూపుడ్ని ఓరకంటతో చూసినదై, జనకశ్యపుత్రి, వరమాల వేసేందుకు నాలుగు అడుగులు ముందుకు వేసింది. మహాలక్ష్మీ తేజంతో, భూమిసుతగా అవతరించిన జనకశ్యపుత్రి, సిగ్గుతో, తలమునకలవుతూ, వరమాలను రెండు చేతులతో పైకెత్తింది. రవి వంశ సోముని శిరసు అందితేగా..నవవధువు పారాణి పాదాలు ముని వేళ్ళ పై నిలిచి అ ఆజానుబాహుని మెడలో వేయ బోవ ..అంత..అలవోకగా అందేనా? ఇదంతా గమనిస్తున్న లక్ష్మణ స్వామి కి సీతమ్మ సమస్య అర్ధమయింది. అప్పటి దాకా 5000 మంది బలశాలులు మోసుకు వచ్చిన శివధనస్సు ను ఫెళ్ళున విరిచిన అన్న గారి పరాక్రమాని తలుచుకుంటూ, మైమరిచి ఉన్న ఆతనికి, వరమాల వేడుక -సీతమ్మ ప్రయత్నమూ చూసి, కించిత్ తెలివిగా, వేడుక మధ్యకు వచ్చి-అన్న గారి పాద పద్మములకు వంగి నమస్కరించాడట. అన్న రామయ్య తటాలున వంగి ఆపేక్షగా తమ్ముడ్ని లేపబోయాడు- అదే అదనుగా సీతాదేవి వరమాలను శ్రీ రాముని మెడలో అలంకరింపజేసినదంటూ, ఆ దృశ్యాన్ని చూస్తూ సభ కరతాళధ్వనులు చేస్తూ ముచ్చట పడిందంటూ, సీతమ్మ, తన చల్లని చూపులతో లక్ష్మణుని దీవించిందంటూ, జనపదులు ఇలా కథలెన్నిటినో సందర్భొచితంగా అల్లుకుంటూ, కడు రమ్యంగా పాడుకుంటూ, మురిసిపోతూ ఉంటారు. జానపద సాహిత్యంలో గమనిస్తే ఇలాంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి.
అలాగే, సీతదేవి పెళ్ళి అలంకారం లో కూడా వర్ణన గమనించండి:
అమ్మా! ముద్దులగుమ్మా - సక్కాని పసిడి బొమ్మా
ఆదివిష్ణుకు నీవు - ఇల్లాలు వైతివి
సక్కాని పసిడి బొమ్మా - సక్కాని బంగారు బొమ్మా
అమ్మా రావమ్మా - రాగిడి చంద్రొంక
రంగైన నగలు - గీర్వాణి జటపాలి
చామంతి పూవులు - దరియించుదూవు ... అమ్మ రావమ్మా..
తమ్మిట్లు జుమకాలు - ఆ పాంజోబీలు (2)
వజ్రేల కాసూల - యాముల్ల పట్టి
పొందూగ వజ్రేల (3) - కాసూలు దట్టి
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
యా దండ గడియాలు - బాజా బందూలు
మురిడీలు గొలుసూలు - ముద్దూటుంగ్రాలు
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
నడుము దొడ్డాణంబు యా నాగ బందంబు
మువ్వ లొడ్డాణంబు - సొగసైన గంటాలు
దరియించు దూవు - రమ్మ రావమ్మ!
అందెలు కడియాలు - అమరంగా పట్టీలు
మట్టెలు బొందూలు - దరియించు దూవు - రామ్మ!
(నాగుల రాములమ్మ సాలూరు పాడిన పాట)
జనపదుల నోట ఊటగా, సిరుల మూటగా
మనకు మిగిలి వున్న వెలలేని తులలేని
మాణిక్యాలుగా నేటికీ మనకు లభ్యమవుతున్నది.
సంక్రాంతి, ఉగాది, శ్రీ రామ నవమి లాంటి మన పర్వదినాలలో
వారి బృందాలని ఆహ్వానించీ వారిచే కార్యక్రమాలను జరిపించీ జానపద వాఙ్మయ సముద్ధరణ ద్వారా ప్రాచీనాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైన ఉందనీ నా భావన.

కామెంట్‌లు లేవు:

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...