24, ఏప్రిల్ 2016, ఆదివారం

నాన్న - నా చిత్రానికి కవిత


నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,
అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు సృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.
కని,పెంచటం అమ్మేఅన్నట్లు కనిపిస్తుంది,
నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మేఅయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లేనని,
కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం అమ్మవంతు,
సరిచేయటం నాన్నతంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు 
దోషాలుకూడా కనబడుతాయి.
ప్రేమించటం అమ్మవంతు అయితే,
దీవించటం నాన్నవంతు.
ఆకలితీర్చటం అమ్మవంతు అయితే,
ఆశలుతీర్చటం నాన్నవంతు.
అమ్మప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్నదీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మగుండెలో పిల్లల సుఖానికి 
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.
నాన్నగుండెలో పిల్లల క్షేమానికి 
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.
అమ్మఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,
నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే ఆరాటం అమ్మది,
కనిపించని పోరాటం నాన్నది.
అమ్మకి లైకులెక్కువ,
నాన్నకి షాకులెక్కువ.
అమ్మ ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద చెరువవటం కనిపించదు.
గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.
పిల్లల జీవితానికి అమ్మ ఒకకళ అయితే, 
నాన్న తళతళ.
కనిపించే దేవత అమ్మ అయితే,
కనపడని దేవుడు నాన్న.
పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి,
నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.

( నాన్న ).
(Courtesy : శ్రీ సాంబశివరావు నూలు)

కామెంట్‌లు లేవు:

కళాప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు charcoal pencil sketch

ఈ చిత్రంలో వ్యక్తి కీర్తిశేషులు ద్వారం భావనారాయణ రావు.   ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన  బాపట్లలో   జన్మించ...